నాగార్జునసాగర్ డ్యాం కుడి, ఎడమ కాలువల క్రస్టుగేట్ల స్థానంలో కొత్త వాటిని అమర్చాలని డ్యాం నిపుణుల కమిటీ ప్రతిపాదించింది. ఇందుకోసం రూ.9 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. కుడి కాలువకు తొమ్మిది, ఎడమ కాలువకు మూడు క్రస్టుగేట్లు ఉన్నాయి. ఎడమ కాలువ కన్నా కుడి కాలువ గేట్లు చిన్నవి. నిరుడు సాగర్ రిజర్వాయర్‌కు గరిష్ఠస్థాయి నీరు వచ్చి చేరింది. కుడి కాలువ తొమ్మిదో గేటు ద్వారా నీటిని విడుదల చేస్తున్న సమయంలో ఒత్తిడి ఎక్కువై మరమ్మతులకు గురైంది. అప్పటి నుంచి ఆ గేటు ద్వారా నీరు వెళుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో కాలువల క్రస్టుగేట్లకు తుప్పు వచ్చి పలుచబడ్డాయని వాటిని తొలగించి కొత్తవాటిని ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ ప్రతిపాదించింది. కుడి కాలువ ఒక్కో గేటుకు రూ.50 లక్షల చొప్పున తొమ్మిదింటికి రూ.4.5 కోట్లు.. ఎడమ కాలువ ఒక్కో గేటుకు రూ.1.50 కోట్లు చొప్పున రూ.4.50 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా వేశారు. ముందుగా కుడి కాలువ తొమ్మిదో గేటు ఏర్పాటు పనుల్ని రెండుమూడు రోజుల్లో ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.