శ్రీశైలం జల విద్యుత్ విద్యుత్ కేంద్రంలో మానవ తప్పిదం వల్లే ప్రమాదం సంభవించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్లలో నిర్వహించిన స్వాతంత్య్ర సమర యోధుడు కొప్పుల రాంరెడ్డి సంస్మరణ సభలో తమ్మినేని పాల్గొన్నారు. మరమ్మతులు జరిగే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే శ్రీశైలం ప్రమాదం జరిగిందని తమ్మినేని ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు.
ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని... మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ప్రపంచంలో ఎక్కడైతే ఆసుపత్రులపై ప్రభుత్వం ఆధిపత్యం ఉంటుందో అక్కడ కరోనా కట్టడి అయ్యిందన్నారు. మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినందునే అమెరికా, బ్రెజిల్ లాగా లక్షలాది మందికి కరోనా వ్యాపించిందని తమ్మినేని వ్యాఖ్యానించారు.