నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్లో.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మార్నింగ్ వాకర్స్ని కలిసి తనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. లక్ష ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తానని మాట తప్పారని విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారని... ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకను ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని.. గులాంగిరి చేసే అభ్యర్థిని ఓడించాలని పట్టభద్రులకు సూచించారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ... ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని, పట్టభద్రులు ఆలోచించి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడిన కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని రాములు నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్, జిల్లా కాంగ్రెస్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు నర్సిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.