నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో విలసిల్లిన ఈ ఐశ్వర్య గణపతి చుట్టు పక్కల ప్రాంతాల వారికి మాత్రమే బాగా తెలుసు. పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో... కోరిన కోర్కెలు తీర్చే ఈ గణనాథుడు నిత్య ధూపధీప నైవేద్యాలకు దూరమయ్యాడు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సొంత గ్రామంలోనే లంబోదరుడు ఏకశిలా విగ్రహంలో దర్శనమిస్తున్నా పట్టించుకునే వారు లేక పక్కనే ఉండిపోయాడు.
ఈ వినాయకుడెలా వెలిశాడంటే...
క్రీస్తుపూర్వం 1043లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన పశ్చిమ చాళుక్యుల వంశానికి చెందిన థైలంపుడు అనే రాజు తన అన్నతో గొడవపడి రాజ్యాన్ని తండ్రికి అప్పజెప్పి ఇంటి నుంచి వచ్చేశారు. రాజ్యానికి దూరంగా ఉండాలనుకొని ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆవంచ గ్రామానికి చేరుకున్నాడు. ఇక్కడే తన పరిపాలన కొనసాగించాడు. అప్పుడే ఆయన ఏకశిలా విగ్రహాన్ని చెక్కించాలని ప్రతిన పూనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పనులు మెదలయ్యాయి. మధ్యలో తన తండ్రి మరణించడంతో థైలంపుడు ఆయన రాజ్యానికి వెళ్లిపోయారు. తిరిగి రాకపోవడం వల్ల ఆ వినాయక విగ్రహం అసంపూర్తిగా ఉండిపోయింది.
ఆరోజు ప్రత్యేక పూజలు..
విగ్రహాన్ని గుర్తించిన స్థానికులు... ప్రతిఏటా వినాయక చవితి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చుట్టుపక్కల వారికి తప్ప ఎవరికీ తెలియని ఈ ఆలయం గురించి అందరికీ తెలియజెప్పాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సొంత గ్రామమైనప్పటికీ... ఏకశిలా విగ్రహం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని వాపోతున్నారు. గతంలో నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చినా... అది అమలుకు నోచుకోలేదని చెబుతున్నారు.
ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ ఏకశిల గణనాథుడిపై ప్రభుత్వాలు చిన్నచూపు చూడడం బాధాకరం. ఆలయాన్ని అభివృద్ధి చేస్తే... ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచడం ఖాయం. ఇకనైనా... ఆవంచలోని ఏకదంతుడి ఆలయంపై అధికారులు, పాలకులు దృష్టి సారిస్తారని ఆశిద్దాం.
ఇవీ చూడండి: ప్రభుత్వ అసమర్థతతో దివాళా దిశగా విద్యుత్ శాఖ: రేవంత్