నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతంలో వటవర్లపల్లి సమీపంలోని రాసమొల్ల బావి బేస్ క్యాంపు దగ్గర మూడు రోజులుగా పెద్ద పులి సంచరిస్తోంది. సోమవారం అటు వైపు వెళ్లిన పశువుల కాపరులకు కనబడటంతో తమ చరవాణిలో ఫొటోలు చిత్రీకరించారు. బేస్ క్యాంపు పరిధిలోని మడుగులో సేద తీరతూ కనిపించింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పరిశీలనకు అటవీ ప్రాంతంలోనికి వెళ్లారు.
మూడు రోజులుగా పెద్ద పులి అక్కడ సంచరిస్తోందని, జంతువును వేటాడి రెండు మూడు రోజులుగా తింటూ ఇక్కడే ఉన్నట్లు భావిస్తున్నామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పులి ఏకాంతానికి భంగం కలుగకుండా, మనుషుల నుంచి అపాయం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. గతంలో మన్ననూర్ వద్ద ఇలాగే వేటకు వచ్చిన పెద్ద పులిని వేటగాళ్లు విషం పెట్టి చంపిన దృష్ట్యా అటవీ శాఖ అధికారులు మనుషులను అటవీ ప్రాంతంలోనికి వెళ్లకుండా కట్టుదిట్టం చేశామన్నారు.