NH167 Bypass Controversy: నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండల కేంద్రం వద్ద నూతన బైపాస్ నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణలో అవకతవకలు జరిగాయని భూములు, ఇళ్లు, ఇండ్ల స్థలాలు కోల్పోయిన బాధితులు ఆరోపిస్తున్నారు. 167వ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కల్వకుర్తి నుంచి మల్లెపల్లి వరకు 67 కిలోమీటర్ల మైలురాయి నుంచి 88 కిలోమీటర్ల మైలురాయి వరకు రెండు వరుసల రహదారిగా విస్తరిస్తున్నారు. NH-167పై అవసరం లేకపోయినా తమ వ్యవసాయ భూములు, ఇండ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాల నుంచి బైపాస్ నిర్మిస్తున్నారని స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
అనర్హులకు అధికంగా.. అర్హులకు తక్కువగా పరిహారం వచ్చేలా లెక్కలు: పలుమార్లు భూసేకరణ కోసం జరిగిన సర్వేను అడ్డుకున్నారు. అయితే.. పోలీసు భద్రత మధ్య రెవిన్యూ, ఆర్ అండ్ బీ అధికారులు సర్వే పూర్తి చేశారు. ఈ సర్వేలో క్షేత్రస్థాయి వాస్తవ కొలతలకు భిన్నంగా భూముల కోల్పోని వారిని నిర్వాసితుల జాబితాలో చేర్చారని మండిపడ్డారు. అనర్హులకు పరిహారం అధికంగా వచ్చేలా చేశారని, అర్హులైన వారికి మాత్రం తక్కువ పరిహారం వచ్చేలా లెక్కలు వేశారని విమర్శిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో వాస్తవ కొలతలు భిన్నంగా ఉన్నాయి: సర్వే నెంబర్ 46లో బాధితులంతా 556 చదరపు మీటర్ల ఇంటిస్థలాలు కోల్పోతున్నట్లుగా నమోదు చేశారు. సర్వే నెంబర్ 85లోనూ స్థలాలు కోల్పోతున్న అందరూ 101 చదరపు మీటర్ల స్థలాల్ని కోల్పోతున్నట్లు అవార్డ్ ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవ కొలతలు భిన్నంగా ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. పరిహారం అంచనా విషయంలోనూ తమకు అన్యాయం జరిగిందని నిర్వాసితులు గోడు వెలిబుచ్చారు. 5 నుంచి 10లక్షలు విలువజేసే ఇంటిస్థలాలకు 2-3 లక్షల పరిహారం ఇస్తామని అధికారులు చెబుతున్నారని, అలాంటి పరిహారం తమకు వద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
90మంది నిర్వాసితులకు ఇప్పటికే పరిహారం పొందారు: ఆధికారులు మాత్రం ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే క్షేత్రస్థాయిలో సర్వే జరిపి భూసేకరణ చేపట్టామని చెబుతున్నారు. 90 మంది నిర్వాసితులు ఇప్పటికే సింహభాగం పరిహారాన్ని చెక్కుల రూపంలో పొందారని చెప్పారు. చెక్కులను తీసుకెళ్లని వారికి ఫిబ్రవరిలో నోటీసులు జారీ చేసినట్లు కల్వకుర్తి ఆర్డీఓ రాజేష్ కుమార్ వెల్లడించారు. మార్కింగ్ చేసిన రహదారి మార్గంలో కొందరి స్థలాలు లేకపోవటం, ఒకే కొలతలున్న ఇంటి స్థలాలకు, ఇండ్లకు పరిహారంలో తేడాలుండటంతో జరిగన సర్వేపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
"నాది మూడు వందల గజాల ప్రదేశం, ఒక ఇల్లు. వీటికి నాకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు రూ.27 లక్షలు. నిజంగా నా ఆస్తి విలువ కోటి రూపాయలు. సర్కార్ ఇచ్చింది ఏం సరిపోతుంది. నాకు అన్యాయం జరిగినట్లేగా. ఈ పరిహారం నేనెట్లా తీసుకుంటా." -బాధితుడు
ఇవీ చదవండి: