నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటకు చెందిన ముడావత్ ఖాల్య, ముడావత్ పాండు, ముడావత్ సీత్యా, కొడావత్ రమేష్ నలుగురు స్నేహితులు. చెడు వ్యసనాలకు బానిసయ్యారు. జల్సాలకు, విలాసాలకు సంపాదించే డబ్బు సరిపోకపోవడం వల్ల దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వనపర్తి జిల్లా ఘనపూర్ పోలీస్టేషన్ పరిధిలోని సెల్కేలాపూర్ గ్రామంలో చోరీ చేశారు. వేసవికాలం కావడం వల్ల జగన్నాథరెడ్డి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి డాబాపైన పడుకున్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఉదయం లేచి చూసేసరికి ఇంటి తాళం పగిపిపోయి ఉండడం, ఇంట్లో చోరీ జరగడం గమనించిన జగన్నాథ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరుస చోరీలపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ అపూర్వ రావు కొత్తకోట సీఐ మల్లికార్జున్ రెడ్డి నేతృత్వంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఘనపూర్ ఎస్సై రామస్వామిలతో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. టెక్నాలజీ సాయంతో నిందితులు తిమ్మాజిపేట మండలం, పులగిరి తండాలో ఉన్నారని కనిపెట్టారు. కదలికలపై దృష్టి సారించి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 23 తులాల బంగారు అభరణాలు, 3సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వరుస దొంగతనాల నిందితులైన ముడావత్ బాల్య, ముడావత్ పాండులపై గతంలో పెద్దమందడి, బొమ్మలరామారం, కేశంపేట, బిజినపల్లి పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను ఆరెస్టు చేసి రిమాండ్కు పంపారు.
ఇవీచూడండి: హరితహారానికి 'ఆరో' మెట్టు.. నేడే శ్రీకారం