నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలిక ఎన్నికల కోసం ప్రకటన విడుదలైంది. ఈనెల 16 నుంచి 18 వరకు ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. 19న నామపత్రాలు పరిశీలన, 20న తిరస్కరణ, 22 నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీగా నిర్ణయించారు. బరిలో నిలిచే అభ్యర్థుల తుదిజాబితాను 22న సాయంత్రం 3 గంటలకు ప్రదర్శిస్తారు. 30న పోలింగ్, మే 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
మినీపోరు కోసం సన్నద్ధం...
రాష్ట్రంలో జరిగే ఈ మినీపోరు కోసం ఇప్పటికే అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఓటర్ల జాబితా, కులగణన, వార్డుల వారీగా రిజర్వేషన్లు, ఛైర్మన్ అభ్యర్థి రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలను గుర్తించి, సిబ్బందిని సైతం ఎన్నికల కోసం సిద్ధంగా ఉంచారు.
అచ్చంపేటకు రెండోసారి...
అచ్చంపేట పురపాలిక పాలక వర్గం గడువు మార్చి 14న ముగియగా తాజాగా రెండోసారి ఎన్నికలు జరగనున్నాయి. అచ్చంపేట పురపాలికను 20 వార్డులుగా పునర్విభజించారు. మున్సిపల్ ఛైర్మన్ పదవిని జనరల్‌కు కేటాయించారు. 20 వార్డుల్లో ఎస్టీ జనరల్-1, ఎస్టీ మహిళ-1, ఎస్సీ జనరల్-2, ఎస్సీ మహిళ-1, బీసీ జనరల్-3, బీసీ మహిళ-2, జనరల్ కేటగిరి-4, జనరల్ మహిళ-6 వార్డులను కేటాయించారు. అచ్చంపేటలో 20,529 మంది ఓటర్లుండగా వారిలో పురుషులు 10,100, మహిళలు 10,428. వీరిలో ఎస్సీలు 3,146, ఎస్టీలు 1,057, బీసీలు 13, 301, ఇతర ఓటర్లు 3,024 మంది ఉన్నారు.
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీలు...
ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పట్టణంలో ఇప్పటికే 40 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి సగటున 513 మంది ఓటర్లు ఉండనున్నారు. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో 20కి 20 వార్డులు తెరాస గెలుచుకోగా... అదే రికార్డును ఈసారి పునరావృతం చేయాలని తెరాస ఉవ్విళ్లూరుతోంది. విపక్షాలు సైతం అచ్చంపేట ఎన్నికల్ని ఈసారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే ఛైర్మన్ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ డీసీసీ అధ్యక్షుడు గార్లపాటి సుదర్శన్ కుమారుడు శ్రీనివాస్‌ను ఛైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలపనుంది. రిజర్వేషన్ల ప్రకటించగా ఆశావహులంతా వారి వారి వార్డుల నుంచి తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేసుకునే పనిలో పడ్డారు.
అచ్చంపేట పురపాలికలో వార్డుల రిజర్వేషన్ల వివరాలు
కేటగిరి | మహిళ | జనరల్ |
ఎస్టీ | 9వవార్డు | 3వ వార్డు |
ఎస్సీ | 8వ వార్డు | 17,13వ వార్డులు |
బీసీ | 4,5 వార్డులు | 1,16,6వ వార్డులు |
జనరల్ | 7,2,12,10,11,19 వార్డులు | 20,15,14,18వ వార్డులు |
ఇదీ చూడండి: తెలంగాణలో మరో ఎన్నికల సమరం.. ఈనెల 30న మినీ సంగ్రామం