Palamuru Praja Bheri in Nagar Kurnool : ఖమ్మంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ తర్వాత నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో అగ్రనేతలతో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. 'పాలమూరు ప్రజాభేరి' అనే పేరును ఈ బహిరంగ సభ కోసం ఖరారు చేసింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేతలు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా.. కొల్లాపూర్ వేదికగా జరిగే పాలమూరు ప్రజాభేరిలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వీరిలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. వీరితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ నాయకులు కాంగ్రెస్‌లో చేరుతారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
'పాలమూరు గడ్డ.. పేదోడి అడ్డా.. దాడులు చేస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదు'
BJP leader Join in Congress Party : మహబూబ్ నగర్ జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మహబూబ్‌నగర్ కీలకమైంది. ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బీజేపీ రాష్ట్రనేత ఒకరు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. దేవరకద్ర నియోజకవర్గంలోనూ గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న నియోజక వర్గ నేత చేరికపైనా ఊహాగానాలు జోరందుకున్నాయి. జడ్చర్ల నియోజకవర్గంలో ఓ కీలక నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే జడ్చర్ల నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.
కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయా.. : జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న సరిత.. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనున్నారు. వనపర్తి జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీఆర్ఎస్కి రాజీనామా చేసిన పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి సహా పలు మండలాల బీఆర్ఎస్ కీలక నాయకులంతా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టనున్నారు. కొడంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి చేరిక కూడా ఇప్పటికే ఖరారైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచర వర్గం అటు కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరనున్నారు.
Congress Party Meeting In Kolhapur : ఉమ్మడి పాలమూరు జిల్లా మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరాలనుకే నాయకులంతా.. కొల్లాపూర్ సభలోనే కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో హస్తం పార్టీలోకి రానున్నారని తెలుస్తోంది. ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ తరహాలోనే పాలమూరు ప్రజాభేరి సభను విజయవంతం చేసేందుకు పీసీసీ సన్నాహాలు చేస్తోంది. సభ నిర్వహణ కోసం ఇప్పటికీ సీనియర్ నేతలతో సమన్వయ కమిటి నియమించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 నియోజక వర్గాల్లో సమన్వయం కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ప్రకటించి.. అధికారంలోకి వస్తే అర్హులైన ఆసరా లబ్దిదారులందరికీ పింఛన్లు రూ.4వేలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇదే తరహాలో పాలమూరు ప్రజాభేరిలోనూ ప్రజాకర్షక ఎన్నికల హమీలను ప్రకటించే అవకాశం ఉంది.
ఇవీ చదవండి :