అటవీ శాఖకు చెందిన భూముల్లో సాగుచేసుకుంటున్న గిరిజనులను ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని ముక్కిడిగుండంలో చోటుచేసుకుంది. పోడు భూముల్లో తాము 30 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్నామని గిరిజనులు వాపోయారు.
తమకు వ్యవసాయం తప్ప వేరే జీవనాధారం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము సాగు చేసుకుంటున్న పొలాల్లో విత్తనాలు వేయకుండా అటవీ అధికారులు అడ్డుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు చెందాల్సిన భూమి వారికే చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డారు. విత్తనాలు వేయకుండా అడ్డుకోవద్దని ఫారెస్ట్ అధికారుల కాళ్లపై పడ్డారు. సాగు చేసుకుంటున్న భూమిని అడ్డుకోవద్దని కోరారు.
ఈ విషయంపై స్పందించిన అటవీ శాఖ అధికారులు గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు అటవీ శాఖవేనని స్పష్టం చేశారు. అటవీ భూముల్లో ఎలాంటి సాగు చేపట్టరాదని రెండు నెలల క్రితమే నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయినా కూడా గిరిజనులు అటవీ భూముల్లో సాగు చేస్తున్నారని తెలిపారు.
ఇదీ చూడండి: Rescue: వాగులో చిక్కుకున్న కూలీలు... కాపాడిన యువకులు