నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలం ఎల్లూర్ సమీపంలో శరవేగంగా సాగుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను జిల్లా కలెక్టర్ శర్మన్ పరిశీలించారు. ఎల్లూరు రిజర్వాయర్ పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రాజెక్టు నమూనా గురించి ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. జీరో పాయింట్ వద్ద పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నమూనాను ఇంజినీర్ల సాయం ద్వారా క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ పంపుహౌజ్, జలాశయం పనులు, ఏదుల జలాశయం పనులను సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు.
అధికారులు మ్యాప్ ద్వారా ప్రాజెక్టు పనులపై కలెక్టర్‌కు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆసియాలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం రికార్డు సృష్టించనుందని, 41 అధునాతన పంపులతో ఈ ప్రాజెక్టు నిర్మాణం రూపొందించామని తెలిపారు. ఇంజినీరింగ్ అధికారులు ప్రాజెక్టు టన్నెల్ పనులను కలెక్టర్‌కు చూపించారు. కిలోమీటర్ల మేర టన్నెల్‌లో ప్రయాణించి సొరంగం నిర్మాణం, ప్రాజెక్టు ప్రగతిపై కలెక్టర్ అధికార్లతో చర్చించారు. కలెక్టర్ వెంట ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అధికారి విజయ భాస్కర్‌రెడ్డి, ఇతర ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.
ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'