రాష్ట్ర పాలనలో తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆరోపించారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో జరిగిన మండల స్థాయి కార్యకర్తల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు.
తెరాసది వైఫల్యాల ప్రభుత్వమని మురళీధర్ రావు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరద సాయం విషయంలోనూ రాజకీయాలు చేస్తూ హైదరాబాద్‌ను ఒకలా ఇతర నగరాలను మరోలా చూడడం తగదని అన్నారు.
ఆయుష్మాన్ భారత్ విషయంలో రాష్ట్రం ఆలస్యంగా స్పందించి లబ్ధిదారులకు తీరని అన్యాయం చేసిందని ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆరోపించారు. కేంద్రం భాగస్వామ్యంతో రాష్ట్రంలో అమలవుతోన్న పథకాల ప్రచారంలో ప్రధాని ఫోటో ఉండటం ప్రోటోకాల్ అని అన్నారు. దీనిపై కొందరు అనవసర రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
ఇదీ చదవండి : ఓటుకు నోటు కేసులో కోర్టుకు హాజరైన రేవంత్‌రెడ్డి