Medaram Maha Jatara: మేడారం మహా జాతర పనులను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ పరిశీలించారు. అనంతరం జాతర పనులపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
అంతకు ముందుగా సమ్మక్క- సారలమ్మను మంత్రులు, సీఎస్, డీజీపీ దర్శించుకున్నారు. అనంతరం జంపన్న వాగు పరిసరాలు, స్నానఘట్టాలను పరిశీలించారు. చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, పార్కింగ్ ఏర్పాట్లను తెలుసుకున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా జాతర ప్రాంగణాన్ని మంత్రులు, అధికారులు పరిశీలించారు.
వనంలోని దేవతలు జనంలోకి
ఆదివాసీ ఆరాధ్యదేవతలైన సమ్మక్క, సారలమ్మల మహా జాతరకు ముహుర్తం సమీపిస్తోంది. వచ్చే నెల 16 నుంచి నాలుగు రోజుల పాటు ఈ జాతర ఘనంగా జరగనుంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు తల్లుల చెంతకు వచ్చి... ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి... జాతరకు తరలివచ్చే భక్తులకోసం ఏర్పాట్లు చేస్తోంది. మాఘ శుద్ధ పౌర్ణమి నుంచి నాలుగు రోజుల పాటు కన్నులపండువగా జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఝార్ఖండ్ నుంచి భక్తులు తరలివస్తారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయలకు నెలవైన ఈ జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది.
ఇదీ చదవండి: Medaram Jatara 2022: కొవిడ్ వేళ సవాల్‌గా మారనున్న మేడారం మహాజాతర