వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం నుంచి ఇప్పటి వరుకు ఎలాంటి స్పందన లేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరిక ఉపేందర్ రావు ఆరోపించారు. తహసీల్దార్లు తమను బెదిరిస్తూ భూ సంబంధిత పనులు చేయించుకుంటున్నారని మండిపడ్డారు.
ములుగు జిల్లా కేంద్రంలోని జడ్పీ హాల్లో వీఆర్వోల సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూ సంబంధిత పనులకు కాకుండా తమని ఇతర వాటికి తీసుకోవాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారన్నారు.
ఉత్తర్వులు వచ్చాకే..
ప్రభుత్వం నుంచి వీఆర్వోల విధివిధానాల ఉత్తర్వులు వచ్చాకే విధులు నిర్వహిస్తారని ఆయన స్పష్టం చేశారు. పది, పన్నెండు సంవత్సరాలు పనిచేసిన వారి ఇంక్రిమెంట్లు ఆగాయన్నారు. వెంకటాపురం మండలంలో వేతనాలు సకాలంలో అందడం లేదని పేర్కొన్నారు.
తహసీల్దార్లు భూ సమస్యలపై వీఆర్వోలను వినియోగించుకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. లేదంటే తమకు ఆ పనులు చెప్పవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆర్డీనెన్స్ను గౌరవించాలని అన్నారు.
ఇదీ చూడండి: 'మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే నేతాజీకి సరైన గుర్తింపు'