Medaram Jatara: మేడారం మహాజాతరకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే భక్తులు పోటెత్తుతున్నారు. సంక్రాంతి సెలవులు కావడం, జాతర సమయంలో రద్దీ పెరగడం... కొవిడ్ ఉద్ధృతి వంటి కారణాలతో ముందుగానే భక్తులు వనదేవతల దర్శనానికి తరలివస్తున్నారు. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలో బారులు తీరుతున్నారు. కుటుంబ సమేతంగా దేవతలకు... పసుపు కుంకుమలతో పూజలు చేసి బంగారాన్ని సమర్పిస్తున్నారు. చల్లంగా చూడూ తల్లి అని వేడుకుంటున్నారు.
రద్దీగా మేడారం పరిసరాలు...
ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా రావడంతో... మేడారం పరిసరాలు రద్దీగా మారుతున్నాయి. దర్శనాల అనంతరం... పరిసర ప్రాంతాల్లో వంటలు చేసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలంటూ మైకుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. రద్దీ ఉన్నా సౌకర్యాలు బాగున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు చర్యలు...
కొవిడ్ దృష్ట్యా ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు... ముందస్తు చర్యలు చేపడుతున్నారు. క్యూలైన్లు పెంచడం సహా భక్తులను ఎక్కువసేపు వేచి ఉంచకుండా త్వరగా అమ్మవార్ల దర్శనం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.