Congress MLA Seethakka Reacts on Manipur Incident : జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో మరో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇప్పటికే ఈ ఘటనపై దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుల మధ్య ఆరోపణలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ క్రమంలో తాజాగా మణిపుర్ ఘటనపై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పందించి.. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
Seethakka Latest Comments : మణిపుర్‌లో దారుణం జరుగుతోందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ప్రధాని మోదీ అక్కడ దారుణాలు జరిగిన 79 రోజుల తర్వాత మాట్లాడటం బాధాకరమని ఆమె ఆక్షేపించారు. ప్రధానిపై ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని తగ్గించడానికే ఇవాళ ఆ అంశంపై మోదీ మాట్లాడారని ధ్వజమెత్తారు. మణిపుర్ ఘటన సభ్యసమాజం సిగ్గుపడేలా ఉందని.. కుకీ తెగపై దాడులు, హత్యాచారాలు బాధాకరమన్నారు. బీజేపీ సర్కారు వైఫల్యం కారణంగానే ఈ ఘటనలు జరుగుతున్నాయన్నారు.
'మణిపుర్‌లో మహిళల పట్ల జరిగిన ఘటన దారుణం. మణిపుర్‌లో పరిస్థితిపై ప్రధాని ఇన్నిరోజులుగా ఎందుకు స్పందించలేదు. 4 నెలలుగా మణిపుర్ మంటల్లో ఉంటే ప్రధాని మౌనంగా ఉన్నారు. దేశ విదేశాలు తిరిగే ప్రధాని మోదీ మణిపుర్‌కు ఎందుకు వెళ్లలేదు. వీడియోలు వైరల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనటం సరికాదు. ఘటనకు బాధ్యులపై ఇన్నాళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదు.'-సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యే
మణిపుర్ ప్రజలకు మోదీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలి : గత నెలలో మణిపుర్ పర్యటనకు వెళ్తున్న రాహుల్ గాంధీని బీజేపీ సర్కార్ అడ్డుకుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న స్పెషల్ స్టేటస్‌ను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాలే తప్ప.. మరేం లేవని ఎద్దేవా చేశారు. మణిపుర్‌లో జరిగే ఘటనలు బయటికు రావడం లేదన్న ఆమె.. ఆర్మీ, నెట్వర్క్ అంతా బీజేపీ చేతుల్లోనే ఉందని ధ్వజమెత్తారు. మోదీ భారతదేశం కోసమే పని చేస్తున్నారా.. లేక పక్క దేశం కోసం పని చేస్తున్నారా అని ఎద్దేవా చేశారు. మణిపుర్ ప్రజలకు మోదీ, అమిత్ షా, కిషన్‌రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలన్న సీతక్క.. లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
'పిల్లలు అని చూడకుండా హత్యాచారాలు జరుగుతున్నాయి. మణిపుర్ సీఎం కూడా ఇవేం కొత్తవి కాదని చెప్పడం బాధాకరం. కొట్లాటలు జరుగుతుంటే అక్కడి సీఎం, పీఎం డిస్కస్ చెయ్యలేదా ? మోదీ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలకు ఇంఛార్జిగా ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? గుజరాత్లో మోదీ సీఎంగా ఉన్నప్పుడే గోద్రా ఘటనలో వేలాది మహిళలు చనిపోయారు. బీజేపీ సర్కార్ రాజకీయం కోసమే తప్ప ప్రజల కోసం, మానవత్వం కోసం పని చేయడం లేదు.'-సీతక్క, ములుగు ఎమ్మెల్యే
Seethakka fires on Kishanreddy : మరోవైపు కిషన్ రెడ్డిని అరెస్టు చేసే అవసరం లేదని ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ డ్రామా చేస్తున్నాయని ఆరోపించారు. ఈశాన్య రాష్ట్రాల మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి.. మణిపుర్ ఘటనపై సైలెంట్‌గా ఉన్నారని ఆక్షేపించారు. కిషన్ రెడ్డి తెలంగాణలో కాకుండా ఈశాన్య రాష్ట్రాల్లో తిరగాలన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. ఆ సమావేశాల్లో పాల్గొనకుండా ఇక్కడేం చేస్తున్నారని సీతక్క ప్రశ్నించారు.
ఇవీ చదవండి :