కలకాలం తోడుగా ఉంటాడనుకున్న భర్త అనారోగ్యంతో మరణించాడు. ఉన్న ఇద్దరు కుమారులైనా ఆసరా అవుతారనుకుంటే.. వారూ నడవలేని స్థితిలో ఉన్నారు. కూలీ చేస్తేగానీ పూటగడవని పరిస్థితి ఆమెది. ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన నేరెళ్ల మల్లికాంబ, రవి దంపతులకు ఇద్దరు కుమారులు. భర్త రవి సుమారు 18 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కుమారులను కష్టపడి పెంచాల్సిన పరిస్థితి నెలకొంది.
కుమారుడు ఆసరాగా ఉంటారనుకొంటే..
పెద్ద కుమారుడు హరీశ్ పుట్టిన కొంతకాలానికే పోలియోతో నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. రెండో కుమారుడు రంజిత్ కుటుంబానికి ఆసరా నిలుస్తాడని మల్లికాంబ ఎంతో ఆశపడింది. అయితే ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి. రంజిత్ 18 నెలల క్రితం అనారోగ్యానికి గురికాగా.. ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు ఇంజక్షన్ ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే.. నడుము నుంచి కిందిభాగం స్పర్శ కోల్పోయింది. అప్పటి నుంచి రంజిత్ చక్రాల కుర్చికే పరిమితమయ్యాడు.
దారి చూపండి..
కుమారుణ్ని బాగుచేయించుకునేందుకు మల్లికాంబ.. వరంగల్, హైదరాబాద్‌లో చికిత్స చేయించారు. ఇప్పటి వరకు సుమారు 14 లక్షలు ఖర్చుపెట్టినా ఫలితం లేకపోయింది. రంజిత్‌కు ఫిజియోథెరఫీ చేయించేందుకు నెలకు 15 వేలు ఖర్చవుతోందని మల్లికాంబ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌లోని పలు ఇళ్లల్లో పనిచేస్తున్న మల్లికాంబ.. ఆ డబ్బులతో వైద్యం చేయిస్తున్నట్లు తెలిపారు. నడుము భాగంలో నరాలు దెబ్బతిన్నట్లు వైద్యులు చెప్పారని.. చికిత్సకు అధిక మొత్తంలో ఖర్చు అవుతోందని ఆమె చెబుతున్నారు. కుటుంబాన్ని పోషించేందుకే ఇబ్బంది అవుతుందని.. ప్రభుత్వం తనకు ఓ దారి చూపించాలని ఆమె కోరుతున్నారు.
పూట గడవని పరిస్థితి..
పలువురు దాతల సహకారంతో ఇప్పటివరకు చికిత్స చేయించానన్న మల్లికాంబ.. పూట గడవని స్థితిలో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నానంటూ కన్నీటి పర్యతమయ్యారు. తన కుటుంబానికి ఉపాధి కల్పించాలంటూ... కలెక్టర్‌కు విన్నవించుకున్నారు
ఇదీచూడండి: Whitener Addicts in Telangana: గంజాయి దొరక్క వైట్నర్కు బానిసలై.. మత్తులో మునిగి హత్యలు చేసి...