Uppal MLA Subhash Reddy Reaction on Non-Allocation of MLA Ticket : బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారో.. ఉద్యమ నాయకుడైన తనకు టికెట్ ఎందుకు నిరాకరించారో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను ఏనాడూ అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని.. అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తిరిగి టికెట్ కేటాయించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పిలిచి మాట్లాడతారని భావిస్తున్నట్లు తెలిపారు. 10 రోజులు వేచి చూస్తానని.. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఉద్యమ నాయకుడినైన తనకు టికెట్ ఎందుకు నిరాకరించారని నిలదీశారు. ఉప్పల్‌లోని తన నివాసంలో కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు.
Uppal MLA Subhash Reddy Latest News : ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఆవిర్భవించిన రెండు నెలలకే తాను పార్టీలో చేరానని సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. 23 ఏళ్లుగా పార్టీ జెండా మోసినట్లు తెలిపారు. అనేక కష్టాలు, కేసులు ఎదుర్కొని పార్టీని కాపాడినట్లు వివరించారు. 2018లో భారీ మెజార్టీతో ఉప్పల్ ప్రజలు తనను గెలిపించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే అయితే ఎవరైనా ఆస్తులు సంపాదించుకుంటారని.. తాను మాత్రం ఆస్తులు అమ్ముకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
BRS MLA Tickets Telangana 2023 : సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట.. ఏడుగురు మహిళలకు ఛాన్స్
అధిష్ఠానం టికెట్ ఇచ్చిన వ్యక్తి ఎప్పుడైనా పార్టీ జెండా మోశారా. బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఎందుకిచ్చారు, నాకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. అవినీతి, అక్రమాలు చేసిన వాళ్లకు టికెట్ ఇచ్చారు. అధిష్ఠానం పిలిచి మాట్లాడుతుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం పార్టీ మారే ఆలోచన లేదు. బొంతు రామ్మోహన్, నేను అసంతృప్తితో ఉన్నది వాస్తవం. పార్టీ నిర్ణయం కోసం మరో 10 రోజులు వేచి చూస్తా. కేసీఆర్‌ను కలిసిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా. కాంగ్రెస్‌లోకి రమ్మని ఎవరూ సంప్రదించలేదు. - బేతి సుభాష్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే
భగ్గుమంటున్న అసంతృప్త నేతలు..: బీఆర్‌ఎస్.. ఇటీవల ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. 119 నియోజకవర్గాలకు గానూ 115 చోట్ల పార్టీ అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దాదాపు సిట్టింగులకే మళ్లీ అవకాశం ఇచ్చిన కేసీఆర్.. కొన్నిచోట్ల మాత్రం అభ్యర్థులను మార్చారు. పనితీరు సరిగా లేని, తరచూ వివాదాల్లో ఉంటున్న వారిని ఈసారి పక్కన బెట్టారు. దీంతో టికెట్ దక్కని ఎమ్మెల్యేలు అధిష్ఠానం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వారి అనుచరులు, మద్దతుదారులు ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఇదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
Mynampally MLA Ticket Issue : మైనంపల్లిని మార్చాలని BRS నిర్ణయం..!