మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రంలోని శైవాలయాలు సిద్ధమయ్యాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో మూడురోజుల పాటు జరిగే మహా జాతరకు అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారి సన్నిధిలో జాగారం చేసేందుకు ప్రత్యేక వసతిని అందుబాటులోకి తెచ్చారు. ఇక తిప్పాపురం బస్టాండ్ నుంచి చెరువు కట్టవరకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించింది. రాజన్న సన్నిధిలో హెలిటాక్సీ సేవలను ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. ఈ సేవలు 14వ తేదీ సాయంత్రం వరకు అందుబాటులో ఉండనున్నాయి.
నదీ తీరంలో
మేడ్చల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఇక తుంగభద్ర నదీ తీరంలో వెలసిన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ప్రభలు కట్టి ఉత్సవాలు
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం మేళ్లచెర్వు శ్రీఇష్ట కామేశ్వర సమేత స్వయంభూ శంబు లింగేశ్వర స్వామి ఆలయం ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. జాతరలో రెండు రోజుల పాటు ప్రభలు కట్టి ఉత్సవాలు జరుపుతారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తీర్థాలలో సంగమేశ్వర స్వామి దేవాలయం శివరాత్రికి సిద్ధమైంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ కనకసోమేశ్వర స్వామి ఆలయం శివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.
ఇదీ చూడండి : తిరుమలేశుని సాలకట్ల తెప్పోత్సవాల తేదీ ఖరారు