మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బౌరంపేటలోని కొమటికుంటలో సుమారు టన్నుకు పైగా చేపలు మృతిచెందాయి. నీళ్లపైకి చేపలు తేలడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చెరువులో లక్షకు పైగా చేప పిల్లలు వేసినట్లు బౌరంపేట ప్రాథమిక మత్స్య సహకార సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం కుంట విషతుల్యమవడంతో వందల సంఖ్యలో చేపలు మృతి చెందాయన్నారు. వీటి విలువ సుమారు రూ.రెండు లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కొమటికుంట పైన ఉన్న మొండికుంటలో గండిమైసమ్మ చౌరస్తా ప్రాంతానికి చెందిన డ్రైనేజీ కలుస్తుంది. మొండికుంట నిండి డ్రైనేజీ కొమటికుంటలో చేరడంతో నీళ్లు విషతుల్యమై చేపలు మృతిచెందాయని సహకారసంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ఇదే విషయమై తహసీల్దార్ భూపాల్, ఇరిగేషన్ డీఈ దృష్టికి తీసుకెళ్లారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: కొవిడ్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే అనుమతి: ఎస్‌ఈసీ