గత 3 రోజులుగా కురుస్తోన్న వర్షాలతో మంజీరా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని వన దుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగి పొర్లుతోంది. ఏడుపాయలలో కొలువైన వన దుర్గా భవాని మాత ఆలయం ముందు నుంచి పరవళ్లు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఏడుపాయలకు వచ్చి.. గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వన దుర్గా భవాని మాత కరుణతో ఈ వానా కాలంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈసారి రైతులు సాగు చేసిన పంటలకు నీటి ఇబ్బంది ఉండదని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం కింద కోట్ల రూపాయలు వెచ్చించి చెరువులన్నీ బాగు చేయగా.. ఇటీవల కురిసిన వర్షాలకు దాదాపు 70 శాతం చెరువులు నిండి అలుగు పారుతుండటం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో పలువురు తెరాస నాయకులు, పాపన్నపేట మండల జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం.. అరెస్ట్ చేసిన పోలీసులు