తల్లిదండ్రులు పిల్ల్లలో ధైర్యం నింపి పాఠశాలలకు పంపించాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. కరోనా వల్ల ప్రపంచం స్తంభించి... విద్యాసంస్థలు మూసివేయాల్సి వచ్చిందన్నారు. మెదక్ కలెక్టర్ వెంకట్‌రామ్ రెడ్డి అధ్యక్షతన... సాయి బాలాజీ గార్డెన్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించనున్నందున... మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వాహణకు ఉపాధిహామీ కూలీలు, పంచాయతీ సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం సిలబస్ పూర్తి చేయాలని సూచించారు.
పది నెలల తర్వాత పాఠశాలలు కళాశాలలు ప్రారంభిస్తున్నందున... తప్పనిసరిగా శానిటైజేషన్ చేయాలని ఆదేశించారు. సిబ్బంది, విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా చూడాలని సూచించారు. గురుకులాల్లో సురక్షిత ఆవాస ప్రణాళికను సిద్దం చేసుకోవాలన్నారు. విద్యార్థులు ప్రజా రవాణ వ్యవస్థను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, రఘునందన్ రావు, క్రాంతి కిరణ్, జడ్పీ ఛైర్‌పర్సన్ హైమలత శేఖర్ గౌడ్, డీఈవో రమేష్, ఆర్డీవోలు సాయి రామ్, శ్యామ్, ప్రకాష్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్ర గౌడ్, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సీఎంగా కేటీఆర్ బాధ్యతలపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ