ధరణి విస్తృతమైన సేవలను రెవెన్యూ విభాగం అందిస్తోందని ఏక కాలంలో ఇప్పటికీ 108 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని పాసుబుక్‌లు పొందారని మెదక్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. ఈరోజు సుమారుగా 50 స్లాట్లు బుక్ చేసుకున్నారని తెలిపారు. మీసేవ కేంద్రాలకు వెళ్లి ప్రాసెసింగ్ ఫీజు కోసం 200 రూపాయలు చెల్లించి.. వెసులుబాటు ఉన్న రోజు స్లాట్ బుక్ చేసుకోవచ్చని సూచించారు. సర్వే నంబర్, ఆధార్ వివరాలు తప్పుగా ఇవ్వకూడదని అన్నారు.
గతంలో డాక్యుమెంటరీ కోసం తెలిసీ తెలియక చాలా డబ్బులు ఖర్చుపెట్టే దుస్థితి ఉండేదని చెప్పారు. కానీ ఇప్పుడు ధరణిలో 15 నిమిషాల్లో ప్రాసెసింగ్ అయిపోయి రైతులకు, ఖాతాదారులకు, అందరికీ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అయిపోయి పాస్ బుక్ పొందే సౌకర్యం ఉందన్నారు. ఇది అద్భుతమైన అవకాశమని జిల్లా ప్రజలు అందరూ వినియోగించుకోవాలన్నారు.