క్షయ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు మెదక్ కలెక్టర్ హరీశ్. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. జిల్లాలోని వైద్యసిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. కేంద్రం.. క్షయ వ్యాధిని 2025 నాటికి పూర్తిగా నశింపజేసే విధంగా ముందుకు సాగుతోందని వివరించారు. మెదక్‌ను టీబీ రహిత జిల్లాగా మార్చుటకు.. ప్రతి ఒక్కరు సైనికుల్లా పని చేయాలని కోరారు. అనంతరం వ్యాధి నివారణలో సేవలందించిన అధికారులకు, సిబ్బందికి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఇతర దేశాలతో పోలిస్తే.. మన దేశ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా క్షయ వ్యాధి సునాయాసంగా వ్యాప్తి చెందుతుందని వివరించారు కలెక్టర్. టీబీని ఆదిలోనే గుర్తించి సరైన చికిత్స అందుకోవాలని సూచించారు. వైద్యాధికారులు.. రోజురోజుకు పెరుగుతున్న క్షయ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
దగ్గు, జ్వరం, బరువు తగ్గటం, రాత్రి పూట చెమటలు పట్టడం వంటి వ్యాధి లక్షణాలు.. రెండు వారాలకు మించి కనిపిస్తే.. వెంటనే జిల్లాలో ఏర్పాటు చేసిన ఉచిత తెమడ కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయితే డాట్స్ పద్ధతిలో ఇంటివద్దకే ఉచితంగా మందులను సరఫరా చేస్తారని తెలిపారు. చికిత్స కాలంలో 'నిక్షయ్ పోషణ్ యోజన పథకం' కింద ప్రతి నెల రూ. 500 చెల్లిస్తారని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో.. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వర్ రావు, టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్, జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ సునీల్, టీబీ చికిత్స పర్యవేక్షకులు, డీఎం.హెచ్.ఓలు, పి.హెచ్.సి. వైద్యాధికారులు, ఏ.ఎన్.ఎం అవార్డు గ్రహీతలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కాలేేజీలు తెరవాలని రోడ్డెక్కిన విద్యార్థులు