కరవుసీమలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో రెండో అతి పెద్ద జలాశయం కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అయిదు జిల్లాల్లోని 2.85 లక్షల ఎకరాల వర్షాధారిత భూములకు సాగు నీరందించే ఈ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే పంపుహౌస్ సహా అన్ని పనులు పూర్తయ్యాయి.
పట్టుబట్టి కాళేశ్వర గంగను పైపైకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ నెల 29న కొండపోచమ్మ సాగర్ జలాశయంలోకి నీళ్లు విడుదల కానున్నాయి. కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన చండీయాగం నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కొండపోచమ్మ ఆలయాన్ని సందర్శించారు.
- ఈ నెల 29న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చండీ, సుదర్శన యాగం, గంగమ్మకు పూజలు నిర్వహిస్తారు. 29వ తేదీ ఉదయం 4 గంటలకు ఏక కాలంలో కొండ పోచమ్మ దేవాలయంలో చండీయాగం, కొండపోచమ్మ సాగర్ పంపుహౌజ్ (మర్కూక్) వద్ద సుదర్శన యాగం పూజలు జరగనున్నాయన్నారు.
- ఉదయం 7.45 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రాజెక్టు నుంచి 30 కిలో మీటర్ల దూరంలో ఉండే కొండ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
- చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. తీర్థ ప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకుంటారు.
- అక్కడి నుంచి ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు సీఏం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం మర్కూక్ వద్ద గల కొండ పోచమ్మ సాగర్ కు నీటిని లిఫ్టు చేసే పంపు హౌజ్ వద్దకు చేరుకుంటారు.
- 10 గంటల సమయంలో పంపుహౌస్ వద్దకు చేరుకుని చినజీయర్ స్వామికి కేసీఆర్ స్వాగతం పలుకుతారు. అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు.
- అనంతరం పంపుహౌజ్ స్విచ్ ఆన్ చేసి (ప్రారంభం) చేస్తారు. అక్కడి నుంచి ప్రాజెక్టు డిశ్చార్జి కెనాల్ (నీరు చేరుకునే ప్రాంతం) వద్దకు వచ్చి గోదావరి జలాలకు సీఎం స్వాగతం పలుకుతారు.
- అతిథులకు అక్కడే మధాహ్నం భోజనం ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: మే 31 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తే రాయితీ