మెదక్ జిల్లాలో నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్‌లో వంద పడకల ఆసుపత్రి ప్రసవాల్లో ముందు వరసలో నిలుస్తోంది. గర్భిణులకు ఇక్కడి ఆసుపత్రి జిల్లాలోనే ఉత్తమ సేవలందిస్తోంది. స్త్రీ వైద్య నిపుణుల కృషి ఫలితంగా వారందిస్తున్న సేవలతో గర్భిణుల రాక అధికంగా ఉంటోంది. కేసీఆర్ కిట్ పథకం ప్రారంభించాక కూడా రికార్డు స్థాయిలో ప్రసవాలు జరుగుతున్నాయి. ఆసుపత్రిలో గర్భిణులకు పరీక్షలు, ప్రసవాలు, సిజేరియన్లు నిర్వహించడంలో స్త్రీవైద్య నిపుణులు వీణాకుమారి ఆదర్శంగా నిలుస్తున్నారు. పట్టణానికి చెందిన వీణా కుమారి రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. అనంతరం సొంతూరుకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్న ఊరిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద వైద్యురాలిగా చేరి పనిచేస్తున్నారు. ఆమెకు తోడుగా మహిళా వైద్యులు ప్రీతీ రెడ్డి, అలేఖ్యలు సేవలందిస్తున్నారు. మత్తు వైద్యులు సురేశ్‌బాబు, మీర్జా బేగ్‌లు బృందంగా నాణ్యమైన సేవలందించడంలో ప్రశంసలు అందుకుంటున్నారు.
వందల సంఖ్యలో గర్భిణులు రాక...
నియోజకవర్గంలోని నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, హత్నూర, చిలప్‌చెడ్, కొల్చారం, వెల్దుర్తి మండలాలతో పాటు, పక్క మండలాలైన తూప్రాన్, గుమ్మడిదల, జిన్నారం మండలాలకు చెందిన గర్భిణులు సైతం తరలి వస్తున్నారు. సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరుగుతుండగా ఈ విషయం అంతటా పాకడంతో వారు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. రోజూ 50 మంది వరకూ వస్తుండగా, మంగళ, శుక్రవారాల్లో వీరి సంఖ్య రెట్టింపు ఉంటోంది. తొలి కాన్పులో 40 శాతం మందికి సిజేరియన్ తప్పడం లేదు. రెండు, మూడో ప్రసవం వారికి 85 శాతం సాధారణ ప్రసవాలు ఉంటున్నాయని వైద్యులు వీణాకుమారి తెలిపారు. నిత్యం ఆసుపత్రిలో అయిదు నుంచి పది వరకు ప్రసవాలు జరుగుతుండగా వారంలో ఒకసారి సిజేరియన్ నిర్వహిస్తున్నారు.
''ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. ముగ్గరు మహిళా వైద్యులు, ఇద్దరు మత్తువైద్యులు అందుబాటులో ఉంటున్నారు. నిత్యం పరీక్షలు చేస్తున్నాం. రెండు వారాల్లో ప్రత్యేక సేవలందిస్తున్నాం. మహిళా రోగులు సేవలను సద్వినియోగం చేసుకోవాలి. మెరుగైన సేవలు అందించడం ద్వారా ప్రశంసలు అందుకోవడం సంతోషంగా ఉంది.''
- డాక్టర్ వీణాకుమారి, స్త్రీవైద్య నిపుణురాలు
ఇదీ చూడండి: ఎంజీఎం ఆస్పత్రి సేవలపై రాష్ట్ర హెచ్చార్సీ సంతృప్తి