మెదక్ జిల్లా రామాయంపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన విజయ్ కుమార్ రెడ్డి, రుచితలు ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు కావడం వల్ల పెద్దలను ఎదురించి ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరికి ఇద్దరు పిల్లలు. వీరి ప్రేమ వివాహం నచ్చని ఇద్దరి కుటుంబ సభ్యుల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ మధ్య కూడా రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది.
పెళ్లైన కొత్తలో కోపంగా ఉన్నా.. కాలం గడుస్తున్నా కొద్ది అందరూ కలిసిపోతారులే అనుకున్న విజయ్ కుమార్ ఆలోచన ఆశగా మిగిలిపోయింది. నిత్యం రెండు కుటుంబాల మధ్య కలహాలు జరగడం చూసి భార్యభర్తలిద్దరూ తట్టుకోలేకపోయారు. మే 27న రాత్రి పురుగుల మందు తాగి.. ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు సిద్ధిపేట ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ దంపతులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అత్తమామల వేధింపులు భరించలేకే.. రుచిత చనిపోయిందని ఆమె తరపు బంధువులు ఆరోపించగా.. రుచిత తరపు బంధువుల వేధింపుల వల్లే విజయ్ కుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తరపు బంధువులు ఆరోపించారు. తల్లిదండ్రులిద్దరు చనిపోవడం వల్ల పిల్లలిద్దరూ అనాథలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్ కోసం మళ్లీ ప్లాస్మా దానం