మంచిర్యాల జిల్లాలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. 45 రోజుల పాటు వేచి చూసిన మందుబాబులు బుధవారం దుకాణాల వద్ద బారులు తీరారు. పోలీసులు, ఆబ్కారీ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పదుల సంఖ్యలో మందుబాబులు ఉండగా ఆ తర్వాత దుకాణాలన్నీ సాదాసీదాగా మారాయి. తిరిగి సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు మళ్లీ దుకాణాల వద్ద కొంత హడావుడి నెలకొంది.
కొత్త ధరలతోనే విక్రయాలు..
పెరిగిన ధరలకు అనుగుణం విక్రయాలు జరిగాయి. గుడిపేటలోని మద్యం డిపోలో లిక్కర్ సీసాల ధరలు ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియలో ఆలస్యం కావడంతో ఆ నిల్వలు గురువారం దుకాణాలకు చేరుకుంటాయని అధికారులు చెబుతున్నారు.
తేటతెల్లమైన అక్రమ అమ్మకాలు
జన్నారంలో రెండు దుకాణాలు ఉండగా ఒకటి, దండేపల్లిలో మూడింట్లో ఒకటి స్టాక్ లేని కారణం గా తెరచుకోలేదు. రామకృష్ణాపూర్‌లో 4 దుకాణాలలో రెండు మాత్రమే తెరిచారు. జిల్లాకేంద్రంలో పలు దుకాణాల్లో కొద్దిపాటి నిల్వలే దర్శనమిచ్చాయి. భీమారంలోని ఓ మద్యం దుకాణం తెరిచినప్పుడు అందులో అతితక్కువ స్టాకు కనిపించింది. చాలాచోట్ల బీర్లు అమ్ముతూ లిక్కర్ లేదని కొనుగోలుదారులను తిప్పిపంపించారు. లాక్‌డౌన్‌లో పెద్ద ఎత్తున మద్యం నిల్వలు అక్రమంగా తరలించి విక్రయాలు జరిపారనడానికి ఈ ఘటనలే నిదర్శనం.
గుడిపేట డిపో నుంచి భారీగా లిక్కర్ అమ్మకాలు: గుడిపేట మద్యం డిపో నుంచి భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా మద్యం వ్యాపారులు డిపోకు తరలివచ్చారు. దీంతో రద్దీ పెరిగింది. డిపోలో కేవలం బీర్ల అమ్మకాలు మాత్రమే నిర్వహించారు. ఇందులో 11,750 బీర్ కాటన్లు అమ్మగా రూ.1.52 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు ప్రకటించారు.
* జిల్లాలోని మద్యం దుకాణాలు- 69
* తెరుచుకున్నవి - 64
* రోజువారీ అమ్మకాల విలువ: రూ. 1.25 కోట్లు (అంచనా)
* బుధవారం నాటి అమ్మకాలు: రూ. 2 కోట్లు (అంచనా)