మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో వైద్యసేవలు సమర్థంగా అందిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా ఆసుపత్రిని ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని వార్డులు కలియ తిరుగుతూ.. రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మందులు ఉన్నాయా లేదా.. రోగులకు చికిత్స అందించడంలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. డెంగ్యూకు మెరుగైన చికిత్స ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. రోగ నిర్ధరణ, ప్లేట్లెట్లు సహా అనేక వైద్య పరీక్షలు, చికిత్స కోసం హైదరాబాద్లో లేని అత్యాధునిక పరికరాలు మహబూబ్నగర్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సామర్థ్యానికి మించి రోగులు వచ్చిన సమర్థంగా సేవలందిస్తున్న వైద్యుల్ని మంత్రి అభినందించారు. ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలాంటి వారైనా కఠినంగా వ్యవహరించక తప్పదని హెచ్చరించారు.
ఇదీ చూడండి : యాదాద్రి రహదారి విస్తరణ జరిగేనా...?