Golf girl Anusha: మహబూబ్ నగర్ సమీపంలోని ఫతేపూర్‌కి చెందిన అనూష.. నంచర్లలోని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. తండ్రి చెన్నయ్య ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా.. తల్లి తిరుపతమ్మ కూలికి వెళ్తోంది. గురుకుల పాఠశాల్లో క్రీడలను ప్రోత్సహిస్తున్న అధికారులు.. ప్రతి పాఠశాలలోని చిన్నారుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు బ్యాటరీ టెస్ట్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 298 పాఠశాలల్లో నిర్వహించిన పరీక్షలో గోల్ఫ్ ఆడే ప్రతిభ ఉన్న 11 మంది విద్యార్థులను గుర్తించి.. గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని గురుకుల పాఠశాలకు మార్చారు. ఈ 11 మందిలో నలుగురు బాలురు, ఏడుగురు బాలికలు ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో వీరికి గోల్ఫ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఐతే వారిలో అనూష తన ప్రతిభతో మంచి పేరు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే నైపుణ్యం కనబరుస్తోంది.
ప్రొఫెషనల్స్ స్థాయిలో
Golf: రెండేళ్ల క్రితం గోల్ఫ్ అంటే ఏంటో తెలియని అనూష... ఇప్పుడు అదే క్రీడలో అదరగొడుతోంది. క్లబ్ పట్టుకునే తీరు.. కొట్టే స్ట్రైక్ అంతా ప్రొఫెషనల్స్ ఆడే విధంగా ఉందని పలువురు అంటున్నారు. ఇప్పటివరకు 5 జోనల్ స్థాయి టోర్నమెంట్లు ఆడిన అనూష.. అన్ని చోట్ల తన ఆటతో అందరినీ ఆశ్చర్యపరిచింది. బెంగళూరులో జరిగిన టోర్నమెంటులో నాలుగోస్థానంలో, విశాఖలో జరిగిన దక్షిణ జాతీయ టోర్నమెంట్‌లో మూడోస్థానంలో నిలిచింది. భవిష్యత్తులో లేడీస్ ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ నిర్వహించే టోర్నమెంట్‌లో పాల్గొని పతకం సాధించడమే లక్ష్యమని అనూష చెబుతోంది.
"ఇప్పటివరకు 5 టోర్నమెంట్లు ఆడాను. బెంగళూరులో నాలుగో స్థానం, వైజాగ్‌లో రెండో రన్నరప్‌గా నిలిచాను. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నదే నా లక్ష్యం." ----అనూష, క్రీడాకారిణి
గోల్ఫ్ ఆడేందుకు ఏకాగ్రత, సహనం చాలా అవసరమని... అది అనూషలో ఉందని కోచ్ భాస్కర్ చెబుతున్నారు. ఆ ఆటలో రాణించడానికి కావాల్సిన నైపుణ్యం అనూషలో ఉందని అంటున్నారు.
"అనూషకు గోల్ఫ్ క్రీడలో చాలా ప్రతిభ ఉంది. తనకు పట్టుదల, ఏకాగ్రత, సహనం చాలా ఉంది. ఏ క్రీడాకారిణికి అయినా ఈ లక్షణాలు, నైపుణ్యాలు చాలా అవసరం." ----భాస్కర్, గోల్ఫ్ కోచ్
"గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ అంతే స్థాయిలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఈ సంస్థలో ఇప్పటివరకు 24 స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు విద్యతో పాటు వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించేందుకు చేయూతనివ్వాలి. " --- --- రాంక్ష్మణ్, క్రీడాధికారి
మట్టి నేలపైనే శిక్షణ
గౌలిదొడ్డిలో పూర్తిస్థాయి సదుపాయాలు లేకపోవడంతో తొలుత మట్టినేలపై శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ రేంజ్ ఐజీగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర చొరవతో వికారాబాద్‌లో ఉన్న ఊటీ గోల్ఫ్ కోర్స్‌లో శిక్షణ అందిస్తున్నారు. గురుకుల విద్యార్థులు ప్రతి గురువారం.. ఊటీ గోల్ఫ్ కోర్స్‌లో సాధన చేస్తున్నారు. సంపన్నులు మాత్రేమే ఆడేందుకు వచ్చే ఊటీ గోల్ఫ్ కోర్స్‌లో... ఆ విద్యార్థుల ఆట చూసి యాజమాన్యం వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించి ప్రోత్సహిస్తోంది. గురుకుల విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: రైతుల నడ్డివిరుస్తున్న పంట రుణాలు.. అసలు కంటే వడ్డీలే ఎక్కువ!