తెరాస పాలనలో ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల పేద ప్రజల్లో విశ్వాసం పెరిగిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని (Telangana Diagnostic center) ప్రారంభించారు. డయాగ్నొస్టిక్ కేంద్రం(Diagnostic center)లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ డయాగ్నొస్టిక్ కేంద్రంలా తీర్చిదిద్దుతామని చెప్పారు. నూతనంగా ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ కేంద్రం ద్వారా నమూనాల సేకరణ ఫలితాల విషయంలో ఎలాంటి తేడా లేకుండా చూసుకోవాలని సూచించారు.
ఫలితాలను తక్షణమే సంబంధిత రోగులకు వారి వాట్సాప్ కు పంపించే ఏర్పాటు చేయాలని… ఫలితాల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయాలని మంత్రి చెప్పారు. పర్యవేక్షించేందుకు ఒక విజిలెన్స్ బృందాన్ని ఏర్పాటు చేయాలని… అంతేకాక తెలంగాణ డయాగ్నొస్టిక్ (Diagnostic watsapp)వాట్సాప్ ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్… పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వారంలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. టెండర్లను పిలిచి కాలువల నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఛైర్మన్ నరసింహులు, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పర్యవేక్షకులు డాక్టర్ రాంకిషన్, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్ హాజరయ్యారు.