Mid Day Meals Workers Protest Over Pending Bills and Salaries : జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం(Mid Day Meals) కరవైంది. 4నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని, తక్షణం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. ఏజెన్సీలు ప్రధానోపాధ్యాయులకు సమ్మె నోటీసులిచ్చి వంటలు మానేశాయి. దీంతో జిల్లాలోని పాఠశాలల్లో ఇవాళ మధ్యాహ్న భోజనం అందలేదు. సమ్మె నోటీసులిచ్చిన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులు ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పక్క గ్రామాల నుంచి వచ్చే పిల్లలు భోజనం(Lunch Meals) ఇంటి నుంచి తెచ్చుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాచారం అందించారు. హాస్టల్ నుంచి వచ్చే పిల్లలకు మధ్యాహ్న భోజనం అక్కడే వండించాలని వార్డెన్లకు సూచించారు.
కొన్ని బడులు టెట్ పరీక్షా కేంద్రాల(TET Exam) కోసం ఎంపిక చేయడంతో మధ్యాహ్నమే పిల్లల్ని ఇంటికి పంపించి వేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేని చోట పిల్లలు ఇంటికి వెళ్లి భోజనాలు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించినా ఎక్కడా ఆ పరిస్థితి కనిపించలేదు. వంట వండేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో సర్కారు తీరుపై ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంట ఏజెన్సీల సమ్మెతో.. విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న తమకు.. ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వంట కార్మికుల సమ్మె బాట, మధ్యాహ్న భోజనం అందక విద్యార్థుల అవస్థలు
"కిరాణా షాపు యజమాని వంట సరకుల బిల్లుల విషయంలో తన దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతున్నారు. ఎవరూ చెల్లించలేదని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అసలు ఎలాంటి బిల్లులు రావడం లేదు. ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టండి అంటే.. చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నామని అంటున్నారు. ఆ డబ్బులు చెల్లించే ఏజెన్సీ వాళ్లను కలిసి అడిగాను. వారు కూడా బిల్లులు రావడం లేదని కష్టంగా ఉందని చెబుతున్నారు. అప్పులు తీసుకువచ్చి కిరాణా సామానులు, వస్తువులు తీసుకురావడం జరుగుతోంది." - విష్ణు, ప్రధానోపాధ్యాయుడు
Mid-day meal problems in Jogulamba Gadwala : 4 నెలలుగా బిల్లులు, 7 నెలలుగా వేతనాలు ఇవ్వనందువల్లే సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని వంట ఏజెన్సీల నిర్వాహకులు అంటున్నారు. వందల మంది విద్యార్థులున్న స్కూళ్లలో వంటలు వండేందుకు లక్షల్లో అప్పులు చేస్తున్నామని.. వడ్డీలు పెరుగుతున్నాయే తప్ప బిల్లులు రావడం లేదని మహిళలు వాపోతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 462 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. రోజుకు 5లక్షల వరకు బిల్లు అవుతుండగా.. నెలకు కోటీ 39 లక్షలు వంట ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉంటుంది. మే నుంచి ఆగస్టు వరకూ ఐదున్నర కోట్ల మేర బకాయిలున్నాయని ఏజెన్సీలు ఆరోపిస్తున్నారు. బిల్లులు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.