రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని.. పల్లెలను సుందరమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావ్ ఆదేశించారు. గ్రామాల్లో ప్రతిరోజూ క్రమం తప్పకుండా మురికి కాలువలు, రహదారులను శుభ్రం చేసి సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లాలోని కోయిలకొండ, చిన్న చింతకుంట మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలతో పల్లె ప్రగతి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పూర్తిగా శానిటేషన్పై శ్రద్ధ వహించాలని కలెక్టర్ వెంకట్రావ్ ఆదేశించారు. నిర్లక్ష్యం వహించినట్లయితే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెలాఖరు వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన పల్లె ప్రకృతి వనాలు పూర్తిచేయాలని పేర్కొన్నారు. వానాకాలం పంట కోతల నాటికి జిల్లాలో నూర్పిడి కల్లాల నిర్మాణం పూర్తి కావాలన్నారు. ఉపాధి హామీ, శ్మశానవాటికలు, ఇంకుడు గుంతలు, చెత్త వేరు చేసే షెడ్డులకు డ్రా చేసిన నిధులకు సంబంధించి చెల్లింపుల వారాన్ని నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం రోడ్లు, భవనాల సర్కిల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్.. జిల్లాలో చేపట్టిన కొత్త కలెక్టరేట్ పనులు, బైపాస్ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా వాట్స్ఆప్ వీడియో కాల్ ద్వారా సోమవారం 16 ఫిర్యాదులు తమ దృష్టికి తీసుకువచ్చినట్టు అదనపు కలెక్టర్ వివరించారు. ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీచూడండి: సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి: బాధితులు