పట్టణప్రగతి కార్యక్రమం నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా రాష్ట్రంలోని మిగతా 12 నగరపాలక సంస్థలు, 128 పురపాలక సంస్థలో కార్యక్రమం జరగనుంది. పదిరోజులపాటు వార్డు యూనిట్‌గా పట్టణ ప్రగతిని నిర్వహిస్తారు.
పట్టణ ప్రగతి - ప్రభుత్వ ప్రణాళిక
- పట్టణ ప్రగతిని పూర్తిస్థాయిలో పర్యవేక్షించేందుకు వీలుగా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన సర్కారు... ప్రత్యేకాధికారులను నియమించింది.
- పట్టణప్రగతి కార్యక్రమాన్ని వార్డులవారీగా అమలు చేయనున్నారు.
- ప్రతి వార్డుకు ఒక ప్రత్యేకాధికారిని ఐదేళ్ల కాలానికి శాశ్వతంగా నియమించారు.
- రాష్ట్ర పురపాలక చట్టంలో పేర్కొన్న విధంగా ఒక్కో వార్డులో 4 కమిటీలు ఏర్పాటు చేశారు. యువజనులు, మహిళలు, వయోజనులు, ప్రముఖులు ఇలా 4 రంగాల నుంచి 15 మంది చొప్పున కమిటీలు ఏర్పాటు చేశారు.
- మొత్తం 3,456 వార్డుల్లో ప్రత్యేకాధికారుల నియామకంతో పాటు కమిటీల ఏర్పాటు ప్రక్రియ కూడా పూర్తయింది.
నేటి నుంచి పది రోజులపాటు పట్టణ ప్రగతి అమలు కానుండగా.. మహబూబ్ నగర్‌లో ఈ కార్యక్రమాన్ని పురపాలక మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు.
కేటీఆర్ పర్యటన వివరాలు
- మహబూబ్‌నగర్‌లోని మెట్టుగడ్డ డైట్ కళాశాల మైదానంలో సమగ్ర శాకాహార, మాంసాహార మార్కెట్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు.
- రైల్వే స్టేషన్ రోడ్డులో సెంట్రల్ లైటింగ్‌ను బాలుర జూనియర్ కళాశాల మైదానంలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభిస్తారు.
- అక్కన్నుంచి పట్టణ ప్రగతిలో భాగంగా పాతతోట మురికివాడలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు.
- పురపాలక కార్యాలయం చేరుకుని చెత్త సేకరణ ఆటోలను ప్రారంభిస్తారు. అనంతరం అప్పనపల్లి వైట్ హౌస్ ఫంక్షన్ హాల్‌లో మున్సిపల్ కౌన్సిలర్లు, కమిటీ సభ్యులు, అధికారులతో సమావేశమై ముఖాముఖిలో పాల్గొంటారు.
ప్రతి అంశంపై పూర్తిస్థాయిలో చర్చ..
రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్‌లు, అధికారులు... పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రత్యేక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు కమిటీలు సమావేశమై వార్డుకు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు.
ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చే దిశగా ..
పట్టణ ప్రగతిలో భాగంగా పచ్చదనం, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇతర సమస్యలు పరిష్కరించడం సహా పట్టణానికి సంబంధించిన వార్షిక, ఐదేళ్ల ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలు నెరవేర్చే దిశగా కార్యక్రమాలు అమలు చేస్తారు. అన్నివర్గాల ప్రజలను విస్తృతంగా భాగస్వాములను చేస్తూ పట్టణ ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి దిశగా కార్యాచరణ చేపట్టనున్నారు.
ఇవీ చూడండి: ఇదే చివరి సమావేశం: జస్టిస్ ధర్మాధికారి