Rain effect in mahaboobnagar: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తెరపి లేకుండా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు... ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు మహబూబ్నగర్ జిల్లా నవాబు పేట మండలంలోని ఎన్మన్ గండ్ల పెద్దచెరువు కట్ట తెగిపోయింది. దీంతో చెరువులోని వరదనీరు పంటపొలాల్ని ముంచెత్తింది. సుమారు 250ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటల్ని రైతులు నష్టపోయారు.
చెరువుకు దిగువన ఉన్న పొలాల్లో కిలోమీటరు మేర.. ఇసుక మేటలు వేసింది. పంటలు, మోటార్లు, వాహనాలు, పశువులు సైతం కొట్టుకుపోయాయని... తిరిగి ఆ భూముల్లో వ్యవసాయం చేయాలంటే ఖర్చుతో కూడిన పని అని రైతులు వాపోతున్నారు. చెరువు కట్టకు లీకేజీలున్నాయని ముందుగా హెచ్చరించినా పట్టించుకోనందువల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు.
కట్టకు మరమ్మత్తులు చేసేందుకు టెండర్లు పిలిచామని.. పనులు చేపట్టే లోపే నష్టం జరిగిపోయిందని.. నీటి పారుదల శాఖ అధికారుల చెబుతున్నారు. తక్షణం తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి చెరువులో నీళ్లు నిల్వ చేస్తామని... మాజీ మంత్రి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. తెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వేసిన పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి మినహా పత్తి, కంది, మొక్కజొన్న, సజ్జ, రాగి పంటలకు కూరగాయలకు తెరపి లేని వర్షాలు నష్టాన్ని మిగిల్చాయని వాపోతున్నారు.
మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయల్ సాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 32అడుగులు కాగా.. ప్రస్తుతం 30 అడుగులకు నీరు చేరింది. వనపర్తి జిల్లా మదనాపూర్ మండలంలోని స్వయం చాలిత నీటిపారుదల ప్రాజెక్టు సరళ సాగర్ సైఫన్‌లు తెరుచుకున్నాయి. రెండు సైఫన్లు వాటంతట అవే.. తెరచుకుని దిగువకు నీటిని విడుదల చేశాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ రిజర్వాయర్ నిండటంతో ఒక గేట్ ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు.
ఇవీ చదవండి: Higu court on Chikoti: చీకోటి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోండి: హైకోర్టు
దర్జాగా పడుకొని ఫ్లైట్లో సిగరెట్ స్మోకింగ్.. డీజీసీఏ సీరియస్