Electricity Problems for Yasangi: ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగి పంటల సాగు ఊపందుకుంది. ఆరుతడి, పప్పు, నూనె గింజల సాగుకు రైతులు ప్రాధాన్యమివ్వాలని వ్యవసాయశాఖ సూచించినా, భూగర్భజల వనరులు పుష్కలంగా ఉండటంతో చాలా వరకు వరి వైపే రైతులు మొగ్గు చూపారు. ఉమ్మడి జిల్లాలో ఆరున్నల లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే, అందులో 4లక్షల ఎకరాల్లో రైతులు వరినే ఎంచుకున్నారు.
గతంలో 24 గంటలు వ్యవసాయానికి కరెంట్ ఇచ్చిన విద్యుత్ సంస్థలు ప్రస్తుతం 12 నుంచి 14 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ఈ కారణంగా సాగుకు నీరందడంలో రైతుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఐదున్నర లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగింటి వరకు మళ్లీ రాత్రి 10 గంటల నుంచి తెల్లావారుజామున ఐదింటి వరకు ప్రస్తుతం సాగుకి త్రీఫేజ్ కరెంటు సరఫరా అవుతోంది.
పంటలకు నీరందడం లేదు: కరెంటు వేళల్లో స్పష్టత లేకపోవడం, తరచూ కోతల కారణంగా అనుకున్న స్థాయిలో పంటలకు నీరందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇచ్చే కరెంటు చాలడం లేదని కొందరు చెబుతుంటే.. 14 గంటలు చాలని ఇంకొందరు అభిప్రాయడుతున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా వల్ల భూగర్భజలాల అడుగుంటుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
పొదుపుగా వాడుకుంటేనే వేసవి గట్టెక్కగలం..: నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకుంటేనే వేసవి గట్టెక్కగలమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎండలు మరింత ముదిరితే సాగునీటి కష్టాలు తప్పవని వాపోతున్నారు. ప్రస్తుత విధానం బాగుందని అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయానికి డిమాండ్ ఉన్న వేళల్లోనే త్రీఫేజ్ కరెంటు అందిస్తున్నామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. గృహ విద్యుత్‌కు డిమాండ్ పెరిగినపుడు వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంటు నిలిపివేస్తున్నారు.
పక్కాగా కరెంట్ అందించేలా చూడాలి..: ప్రస్తుతం పగలు, రాత్రి నిర్ణీత వేళల్లో 14 గంటల పాటు ఇస్తున్నామని చెబుతున్నారు. కర్షకులు ఆటో స్టాటర్లతో మోటార్లు నడపడం వల్ల గ్రిడ్‌లపై భారం పడుతున్నందున వాటిని తీసేయాలని కోరుతున్నారు. ప్రస్తుతానికి నీటికి ఢోకా లేకున్నా, ఏప్రిల్ నాటికి భూగర్భజలాలు పడిపోవడం, ఆ సమయంలో విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు ఎదురైతే పంటలు చేతికందవని ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ అధికారులు పక్కాగా కరెంట్ అందించేలా చూడాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: