ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా మినహా ఇతర జిల్లాల్లో పురోగతి కనిపించడం లేదు. ఐదు జిల్లాల్లో మొదటి, రెండు దశల్లో 21,213 ఇళ్లు మంజూరుకాగా... వీటిలో ఇప్పటివరకు 3,642 మాత్రమే పూర్తయ్యాయి. 8,587 ఇళ్లు అసలు ప్రారంభానికే నోచుకోకపోగా... మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి.
ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు..
నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాలో ఒక్క ఇల్లు కూడా నిర్మాణం పూర్తి కాలేదు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజక వర్గానికి కేటాయించిన 80 ఇళ్లు, నారాయణపేట నియోజకవర్గానికి కేటాయించిన 767 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచినా గుత్తేదారుల నుంచి స్పందన లేదు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 2,654 ఇళ్లకు టెండర్లు పిలిస్తే కేవలం 1,235 ఇళ్లకు మాత్రమే టెండర్లు ఖరారయ్యాయి. వాటిల్లో 1,047 నిర్మాణాలకు ఒప్పందాలు జరగగా.. 292 గృహాల పనులు ప్రారంభం కాలేదు. జోగులాంబ గద్వాల జిల్లాలోనూ పూరైన ఇళ్లు తప్ప మరెక్కడ పనులు జరగడం లేదు. వీరన్నపేటలో 34.98 కోట్లతో 660 గృహాలను నిర్మించి 291 మందికి మాత్రమే కేటాయించారు. లబ్ధిదారుల కేటాయింపుల్లో లోపాలున్నాయన్న ఆరోపణలతో క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు.
పూర్తయ్యాయి.. కానీ
దివిటిపల్లి వద్ద 2015లో రూ.61.65 కోట్ల వ్యయంతో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తిచేసి, 2018 సెప్టెంబర్‌లోనే మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రెండేళ్లు పూర్తవుతున్నా వీటిని పేదలకు పంపిణీ చేయలేదు. గద్వాలలో 585 గృహాల నిర్మాణం పూర్తైనా లబ్ధిదారులకు అందించలేదు. అలంపూర్ మండలంలో 20 గృహాలు పూర్తై ఆరు నెలలవుతున్న ఇప్పటికీ లబ్ధిదారులకు కేటాయించలేదు.
టెండర్లు పిలుస్తున్నా..
గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాల కోసం టెండర్లు పిలుస్తున్నా... గుత్తేదారులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం మంజూరు చేసే రూ.5.04 లక్షలు గిట్టుబాటు కాకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. పట్టణాల్లో 5.30 లక్షలు మంజూరు చేస్తుండగా.. గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు, పైఅంతస్థుల్లో నిర్మించే అవకాశం ఉంది. దీంతో కాస్తా ఖర్చు కలిసొస్తుందని గుత్తేదారులు ముందుకొస్తున్నారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రమే పనులు జోరుగా సాగతున్నాయి. 7,700 గృహాలకు ఇప్పటికి 2,500 పూర్తి చేశారు. మరో 2,600 ఇళ్లను త్వరలోనే అందిస్తామని జిల్లా అధికారులు తెలిపారు. ఇప్పటివరకు పూర్తయిన ఇళ్లను వీలైనంత త్వరగా కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
జిల్లా పేరు | మంజూరైనవి | పూర్తైనవి | పురోగతిలో ఉన్నవి | ప్రారంభం కానివి | కేటాయింపులు | ఖర్చు (కోట్లలో) |
మహబూబ్ నగర్ | 7783 | 2485 | 4618 | 680 | రూ.422.79 | రూ.190 |
నారాయణపేట | 2567 | 0 | 900 | 1667 | రూ.130.41 | రూ.3.61 |
నాగర్ కర్నూల్ | 3816 | 0 | 755 | 3061 | రూ.192.32 | రూ.25.07 |
వనపర్తి | 4487 | 552 | 2621 | 1314 | - | - |
జోగులాంబ గద్వాల | 2470 | 605 | 0 | 1865 | - | - |
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చేలా గుత్తేదారుల్ని ప్రోత్సహిస్తున్నామని అధికారులు తెలుపుతున్నారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చుతున్నామని... మంత్రి, కలెక్టర్ సహకారంతో ఇసుక కొరత లేకుండా చూస్తున్నామని వెల్లడించారు. టెండర్లు పూర్తి కాగానే స్థల సేకరణ వేగంగా అయ్యేలా చూస్తున్నామని పేర్కొన్నారు. నీటి సదుపాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇతర ప్రభుత్వశాఖల సహకారం, నిరంతర పర్యవేక్షణ కారణంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఇళ్లు వేగంగా పూర్తవుతున్నాయన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మరో 2,600 ఇళ్లు పూర్తి చేసి అందిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'ప్రతీ పేదవానికి రెండు పడక గదుల ఇళ్లు ఇస్తాం'