ఆర్టీసీ ఉద్యోగులు కరోనా బారిన పడకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని మహబూబ్‌నగర్ డిపో మేనేజక్ అశోక్ రాజు అన్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్లతో సమానంగా విధి నిర్వహణలో ఉంటున్న ఆర్టీసీ సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. డిపోలో 540 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉండగా.. 45 ఏళ్లు దాటిన సిబ్బందికి టీకా వేయించే కార్యక్రమాన్ని మేనేజర్ ప్రారంభించారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ టీకా ఇప్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేసిందని అశోక్ రాజు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేసి వ్యాక్సిన్ అందిస్తున్నట్లు వెల్లడించారు. రోజుకు 80 నుంచి 100 మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. రానున్న మూడు రోజుల్లో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. ఎవరికైనా అపోహాలు ఉంటే వైద్యాధికారులు అవగాహన కల్పిస్తున్నారని ఆయన వివరించారు.