Muralidhar Rao On KCR: రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయహోదా అంశాన్ని లేవనెత్తుతున్నారని భాజపా మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్ మురళీధర్ రావు ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాల్లో ఈ అంశం గురించి ఎక్కడా ప్రస్తావించలేదని పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా భాజపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాజకీయ లబ్ధి కోసమే ఆ అంశాన్ని లేవనెత్తుతున్నారని ఆరోపించారు. కేసీఆర్కు ఈ మధ్య కాంగ్రెస్, రాహుల్ గాంధీపై ప్రేమ పెరిగిందని.. హస్తంతో దోస్తీకి కొత్త సమీకరణం జరుగుతోందని విమర్శించారు.
తక్కువ కాలంలో ఎక్కువ జాతీయ రహదారులు పొందిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వెల్లడించారు. రైతులకు రాయితీలు ఇవ్వొద్దని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని.. మీటర్లు బిగించి కూడా రాయితీలు ఇవ్వొచ్చన్నారు. మీటర్లు బిగించడానికి... రాయితీలకు సంబంధం లేదని తెలిపారు. ఈ విషయంలో తెరాస అసత్య ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 20వేల ఎకరాల దేవాదాయ భూములు కబ్జాకు గురయ్యాయని, వాటి పరిరక్షణకు అవసరమైతే రాష్ట్ర వ్యాప్త పోరాటానికి భాజపా శ్రీకారం చుడుతుందన్నారు. మహబూబ్నగర్ పట్టణంలో అంబాభవానీ ఆలయ భూముల్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. జడ్చర్లలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయ భూముల్ని సైతం కబ్జా చేశారని, గుడికి భూములే లేకుండా చేస్తున్నారన్నారు.
పాలమూరు జిల్లాలను సస్యశ్యామలం చేసే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఏమైందని ఆయన ప్రశ్నించారు. మూడేళ్లలో పూర్తి చేస్తానన్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 20శాతం కూడా పూర్తి కాలేదని, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం భాజపా కంకణం కట్టుకుందన్నారు.
తెలంగాణ, ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడుతున్న సమయంలో అగ్రిమెంటు రాస్తుండగా.. తెలంగాణలోని నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలా అనే విషయం అందులో ఎక్కడా లేదు. మాకు తెలంగాణ వస్తే చాలు అనే ఆలోచనలోనే అందరం ఉన్నాం. తెలంగాణ ఇప్పించడానికి ఒప్పించడం కోసం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ఒప్పుకుంది. అది ఒప్పందంలో భాగం. మీటర్లు పెడితే నేను ఒప్పుకోను... రైతులకు సబ్సిడీ ఇవ్వడానికి వీళ్లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డరును మీడియా ముందు పెట్టు. మీటరుకు, సబ్సిడీలకు సంబంధం లేదు. కేసీఆర్కు ఈ మధ్యన కాంగ్రెస్ మీద ప్రేమ పుట్టింది. భూతులకు గుర్తు ఎవరంటే కేసీఆర్.. ఆయనకు రాహుల్ గాంధీ మీద ప్రేమ పుట్టింది. కాంగ్రెస్ పార్టీతో దోస్తీ ప్రారంభమైంది. కొత్త సమీకరణ వస్తోంది. భాజపాకు నీతులు చెప్పే అర్హత మీకు లేదు. పెండింగ్ ప్రాజెక్టులు పాలమూరులో పెద్ద ఉద్యమానికి భాజపా నాయకత్వం వహిస్తుంది. నీటి బొట్టు చివరి మడికి తీసుకొచ్చేంత వరకు భాజపా కంకణం కట్టుకుని ఉంది. తెరాసకు చేతకాకపోతే భాజపా ప్రభుత్వం సాధించి తీరుతుంది.
-మురళీధర్ రావు, భాజపా మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్
ఇదీ చూడండి : Bandi sanjay Fires on KCR: తర్వాత పీసీసీ అధ్యక్షుడు కేసీఆరే: బండి సంజయ్