మధ్యప్రదేశ్లోని కలువా జిల్లాలో ఓంకారేశ్వర్ దర్శనం కోసం వెళ్లి నర్మదా నదిలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన రాజశేఖర్ సహా నలుగురు స్నేహితులు ఈ నెల 11న ఓంకారేశ్వర్ దర్శనం కోసం వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున అక్కడకు చేరుకున్నారు. నదిలోకి స్నానం కోసం దిగగా... నర్మదా డ్యాం గేట్లు తెరవడంతో ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఆ సమయంలో నదిలో ఉన్న రాజశేఖర్ ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. స్నేహితులు అతన్ని కర్రలతో రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. రాజశేఖర్ ప్రస్తుతం మహబూబ్ నగర్ ఐసీడీఎస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు.
జరిగిన ఘటనపై కలెక్టర్, మంత్రి, ఎస్పీలకు సమాచారం అందగా మధ్యప్రదేశ్ అధికారులతో వారు మాట్లాడారు. గాలింపు చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు. ఈ మేరకు గజఈతగాళ్లతో గాలింపు బృందాన్ని ఏర్పాటు చేసి రాజశేఖర్ కోసం వెతుకుతున్నారు. సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు మహబూబ్ నగర్ నుంచి కూడా ఇద్దరు అధికారులు హుటాహుటిన కలువా జిల్లాకు చేరుకున్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అధికారులకు అందిస్తున్నారు. మరోవైపు గల్లంతైన వ్యక్తి భార్య ప్రస్తుతం గర్భిణి.
ఇవీ చూడండి: నగ్నంగా నృత్యాలు చేస్తున్న 22 మంది యువతుల అరెస్ట్