మావోయిస్టు అగ్రనేత, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరి భూషణ్ శకం ముగిసింది. గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హరిభూషణ్ మరణంపై వస్తున్న ప్రచారాలకు తెర పడేలా.. నిన్న మావోయిస్టు అధికార పార్టీ ప్రతినిధి ధ్రువీకరించారు. కరోనా బారిన పడి హరిభూషణ్ తుది శ్వాస విడిచినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఆయన అంత్యక్రియలు పూర్తి చేసినట్లు లేఖ విడుదల చేశారు.
మహబూబాబాద్ జిల్లాలోని ఆదివాసీ కుటుంబంలో పుట్టిన హరి భూషణ్ కొంతకాలం వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేసి, ఏజెన్సీ గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేశారు. మావోయిజం పట్ల ఆకర్షితుడై 1988లో నక్సల్స్‌లో చేరాడు. ఆయన అందులో చేరిన మూడు సంవత్సరాలకు గానీ కుటుంబ సభ్యులకు విషయం తెలియలేదు. 21న హరిభూషణ్ మృతి చెందగా, 22న ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్ధబోయిన సారక్క అలియాస్ భారతక్క కూడా కరోనాతోనే మరణించారు. ఇరువురి అంత్యక్రియలు పూర్తి చేసినట్లు పార్టీ ప్రతినిధి వెల్లడించారు.
విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడై
హరి భూషణ్ గంగారం మండలం, మడగూడెం గ్రామంలోని ఆదివాసీ కుటుంబంలో జన్మించారు. తండ్రి రంగయ్య, తల్లి పొమ్మక్క.. వీరికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. హరిభూషణ్ పెద్దవాడు. ఇంటర్మీడియట్ వరకు నర్సంపేటలో చదివి, హన్మకొండలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలోనే శ్రీకాకుళం రైతు ఉద్యమాల ప్రభావం ఆయనపై పడింది. దేశ వ్యాప్తంగా రగులుతున్న భూ స్వామ్య వ్యతిరేక పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించడంతో విద్యార్థులపై విప్లవ రాజకీయాల ప్రభావం పడింది. దీంతో డిగ్రీ చదువుతున్న సమయంలో ఆర్ఎస్యూ నాయకత్వంలో విద్యార్థి ఉద్యమాల్లో హరిభూషణ్ చురుగ్గా పాల్గొనేవారు.
అంచెలంచెలుగా ఎదిగి
1988లో మావోయిస్టు పార్టీలో చేరిన హరిభూషణ్.. పార్టీ నిర్ణయం మేరకు 1991లో అటవీ దళంలో చేరారు. కొద్దికాలం నెక్కొండ దళంలో పని చేసి అక్కడి నుంచి పాండవ దళంలో సభ్యుడిగా, డిప్యూటీ కమాండర్‌గా, ఆర్గనైజర్‌గా భాద్యతలు చేపట్టి అంచెలంచెలుగా ఎదిగారు. 1996లో ఖమ్మం జిల్లా కమిటీ మెంబర్‌గా కొనసాగుతూ, 1998 నవంబరులో ఉత్తర తెలంగాణ మొదటి ప్లాటూన్ బాధ్యతలు తీసుకున్నారు. 2000లో కేంద్ర కమిటీ ప్రొటెక్షన్ ప్లాటూన్‌కు బదిలీ అయ్యి 2005 వరకు కొనసాగారు. కొద్ది కాలం ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేసి 2005లోనే స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఇదే సంవత్సరం చివరిలో విప్లవోద్యమ అవసరాల రీత్యా తిరిగి ఉత్తర తెలంగాణకు వచ్చి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. 2015 ప్లీనంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, 2018 నవంబరులో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ప్రజలకు తోడుగా
33 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో అనేక ఎత్తు పల్లాలు, ఆటుపోట్లు ఎదుర్కొన్న హరిభూషణ్.. కష్ట సమయాల్లో ప్రజలతో, క్యాడర్లతో ఉంటూ వారికి మార్గ నిర్దేశం చేస్తూ వచ్చారు. శత్రు నిర్బంధంలో తెలంగాణ విప్లవోద్యమం దెబ్బతిని వర్గ సంఘాలు పనిచేయలేని స్థితిలో.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రజా పోరాటాలతో తెలంగాణ ఉద్యమానికి కొత్త ఉత్సాహం తీసుకొచ్చారు.
సంబంధిత వార్త: Maoist Hari Bhushan: మావోయిస్టు నేత హరిభూషణ్ మృతి: ఎస్పీ సునీల్ దత్
ఇదీ చదవండి: Minister Vemula: రాయలసీమ ఎత్తిపోతల అక్రమమని తేలిపోయింది: ప్రశాంత్‌రెడ్డి