one person washed away: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం చెరువు వద్ద ఒకరు గల్లంతయ్యారు. గేదెను రక్షించబోయి నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. గ్రామానికి చెందిన పల్లె యాకయ్య (50) పొలం పనులకు వెళ్తూ అలుగు దాటుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. అయితే గేదె క్షేమంగా బయటకొచ్చింది.
సమాచారం అందుకున్న తొర్రూర్ పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతవరకు ఆ వ్యక్తి ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు అలుగు పారుతున్నాయి.
గల్లంతైన వ్యక్తి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలిస్తున్నాం. మా వంతు మేం గట్టిగా ప్రయత్నిస్తున్నాం. అధికారులు, పోలీసులు సమన్వయంతో పని చేస్తున్నారు. బాధితుని కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలు ఉన్నందున ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలి. - ఎర్రబెల్లి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
మంత్రిని అడ్డుకున్న వీఆర్ఏలు: గత మూడు రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యక్రమం వద్ద నిరాహారదీక్ష లు చేస్తున్న వీఆర్ఏలు మంత్రి ఎర్రబెల్లిని అడ్డుకునేందుకు యత్నించారు. భారీ వర్షాల నేపథ్యంలో సమీక్ష చేసేందుకు జనగామ కలెక్టర్ కార్యాలయానికి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వీఆర్ఏలను అడ్డుకున్నారు. కొందరు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నిచడంతో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో వీఆర్ఏలకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
దళితబంధు చెక్కులు పంపిణీ: ఎస్సీలు ఆర్థికంగా స్వాభిమానంతో జీవించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. వరంగల్ జిల్లా మామునూరు పీటీసీలో వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన 57మంది లబ్ధిదారులకు చెక్కులను మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేశారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు దళితులను ఓటు బ్యాంక్ గానే చూశాయని విమర్శించారు. దళిత బంధు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎర్రబెల్లి అన్నారు.
ఇవీ చదవండి: వాగును తలపిస్తోన్న రహదారి.. మోకాళ్ల లోతు వరదతో వాహనదారుల ఇక్కట్లు