మహబూబాబాద్ జిల్లా కురవిలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారిని ఎంపీ మాలోతు కవిత దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కురవి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లతో చేపట్టిన పనులు వచ్చే శివరాత్రి నాటికి పూర్తవుతాయని ఎంపీ పేర్కొన్నారు.
స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లావాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా... అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.