గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ శివారు దుబ్బతండా నుంచి దంతాలపల్లికి నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఐటీడీఏ నిధులు రూ.2 కోట్లతో కొమ్ములవంచ నుంచి వయా దుబ్బతండా, బొడ్లాడ శివారు తేజ్యాతండా మీదుగా దంతాలపల్లికి బీటీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
అనంతరం కొమ్ములవంచలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి పలు సమస్యల వివరాలు తెలుసుకున్నారు. గ్రామాల్లో తక్కువ ధరకు విక్రయించి నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను పొందాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీచూడండి: భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి: చాడ వెంకట్ రెడ్డి