ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని తద్వారా రైతులకు మేలు జరుగుతుందని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కల్వల, గాంధీపురం శివారులో ఎస్సారెస్పీ కాలువల్లో పూడికతీత పనులను ఎంపీ కవిత, కలెక్టర్ గౌతం, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లతో కలిసి ఆమె ప్రారంభించారు. ఉపాధి హామీ కూలీలకు గతంలో కంటే ఎక్కువగా రూ.200 పైగా కూలీ వస్తుందని చెప్పారు. ఉపాధి హామీ పనులను ఏడాది పొడవునా జరిగేలా వెసులుబాటు కల్పించామన్నారు. ఎవరి గ్రామాల్లో పనులన్నీ వారే చేయించుకుని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు.
కల్లాలు మంజూరు
మహబూబాబాద్ నియోజకవర్గానికి 1000 కల్లాలు మంజూరయ్యాయని తెలిపారు. రైతులంతా దరఖాస్తు చేసుకుని కల్లాలను నిర్మించుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ రైతులు ఉపాధి హామీ పథకంలో షెడ్లు నిర్మించుకున్నా, పండ్ల తోటలు, ఆయిల్ ఫామ్ వేసినా 100 శాతం సబ్సిడీ వస్తుందన్నారు. మిగతా రైతులకు 90 శాతం సబ్సిడీతో వస్తుందని తెలిపారు. రైతులంతా దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఏ రాష్ట్రంలో లేని పథకాలను చేపట్టి అమలు చేస్తుంటే.. కొంతమంది దొంగ దీక్షలు చేస్తూ, ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు.
ప్రతిపక్షాలపై..
వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతులకు అండగా నిలబడ్డారా అని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటలను కొన్నారా గుండె మీద చేతులు వేసుకుని ఆలోచించుకోవాలని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రైతును రాజు చేయాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెరాస నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఇదీ చూడండి : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 40కేసులు