మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో వర్షాల కారణంగా జరిగిన పంటనష్టం, దెబ్బతిన్న రహదారులు, ఆస్తినష్టం, పునరావాస కేంద్రాలు, వసతుల కల్పన, కరోనా కట్టడిపై మంత్రి ఆరా తీశారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాగులు పొంగి బ్రిడ్జిలపై నుంచి ప్రవహిస్తున్న ప్రాంతాలలో ఎత్తు పెంచి కొత్త వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టాలని ఆదేశించారు.
ప్రస్తుతం పరిస్థితి చక్కదిద్దేందుకుప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో కొవిడ్ పరిస్థితిపై వైద్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రాంతాల్లోని నిరాశ్రయులకు స్థానికంగా ఖాళీగా ఉన్న వసతి గృహాల్లో ఆవాసం కల్పించి, వారికి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'కరోనా టీకా అత్యవసర ఆమోదాన్ని పరిశీలిస్తాం'