KTR Distributed Podu Pattas : పోడు భూముల లబ్ధిదారులకు రేపటి నుంచి రైతుబంధు, ప్రమాదం జరిగి చనిపోతే రైతు బీమా వర్తిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మహబూబాద్‌లో పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేసిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా 4.06 లక్షల ఎకరాల ద్వారా 1.51 లక్షల పోడు రైతుల కుటుంబాలకు లబ్ధి కలగనున్నట్లు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 24,281 మంది రైతులకు 67,730 ఎకరాల పోడు పట్టాలు అందించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో రూ.10.60 కోట్లతో నూతనంగా నిర్మించిన 200 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
విభజన హామీలను అమలు చేయని మోదీ క్షమాపణ చెప్పాలని.. కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని.. కేంద్రం ఇచ్చిన హామీలలో ట్రైబల్ యూనివర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ఏమైందని ప్రశ్నించారు. ఈ హామీల గురించి వరంగల్‌కు వచ్చే ప్రధాని మోదీని.. ప్రజలు ప్రశ్నించాలని కోరారు. ములుగులో 360 ఎకరాల భూమి ఇచ్చినా గిరిజన వర్సిటీ ఏర్పాటు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి.. రైళ్ల వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీ పెడుతున్నారన్నారు. ఇచ్చిన మాట తప్పినందుకు మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. మోదీ దేశానికి ప్రధాని.. ఒక్క గుజరాత్‌కు కాదనే విషయాన్ని గమనించాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.. పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్క ఈ రోడ్డు ఇట్లుంటదా గది గట్లుంటదా అంటున్నారు.. అలా ఉండడానికి మీరు మీపాలన కారణం కాదా అని కాంగ్రెస్‌ను కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ నాయకులు అడ్డగోలు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తారని.. 50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసిందని నిలదీశారు. ఇకనైనా వారి హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. అధికారంలోకి వచ్చేందుకు అడ్డమైన గడ్డి తింటారని దుయ్యబట్టారు. పండుగ వాతావరణంలో గిరిజనలు ఆనందపడేలా రాష్ట్ర వ్యాప్తంగా పోడు పట్టాలు ఇస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల నినాదం ఉండేదని.. కేసీఆర్ నీళ్ల విషయంలో న్యాయం చేశారని తెలిపారు.
రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో 26 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. 9 ఏళ్ల కేసిఆర్ పాలనలో లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మరో 80 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు. పదేళ్లలో కాంగ్రెస్ 26 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. కేసీఆర్ పాలనలో సంవత్సరానికి 22 వేల ఉద్యోగాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఆరు శాతం ఉన్న ఎస్టీల రిజర్వేషన్‌ను పదిశాతం పెంచుతున్నట్లు.. పోడు పట్టాలతో పాటు ఈ జులై మాసంలోనే రైతుబంధు, రైతుబీమా వర్తింపజేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: