వలస కూలీలతో కరోనా వైరస్ విస్తరించే అవకాశాలున్నాయని... ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామపంచాయతీని ఆకస్మికంగా పరిశీలించారు. మొక్కల పెంపకంపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి... సిబ్బందికి పలు సూచనలు చేశారు.
అనంతరం నర్సింహులపేట మండలం బొజ్జన్నపేటలో ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని... భౌతిక దూరం పాటిస్తూనే పనులు చేయాలని సూచించారు. వలస కూలీలను సైతం మనలో ఒకరిగా గౌరవించాలని... కరోనా వైరస్ విస్తరించకుండా జాగ్రత్త పడాలని మంత్రి తెలిపారు.
