అభంశుభం తెలియని బాలుడు... ఓ ఉన్మాది కర్కశత్వానికి బలయ్యాడు. పట్టుమని పదేళ్లు కూడా దాటకుండానే విగతజీవిగా మారాడు. మహబూబాబాద్‌లో ఐదు రోజుల క్రితం అపహరణకు గురైన తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌రెడ్డిని... కిడ్నాపర్ కిరాతకంగా చంపేశాడు. ఈ దుర్మార్గానికి ఒడిగట్టింది శనిగపురం గ్రామానికి చెందిన 23 ఏళ్ల మందసాగర్‌గా పోలీసులు గుర్తించారు.
ఈనెల 18న కిడ్నాప్...
మహబూబాబాద్ కృష్ణకాలనీలో నివాసముంటూ ఓ టీవీ ఛానల్‌లో పనిచేస్తున్న రంజిత్- వసంతల పెద్దకుమారుడు దీక్షిత్‌రెడ్డిని ఈనెల 18న సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటుండగా... ఓ అగంతకుడు ద్విచక్రవాహనంపై వచ్చి కిడ్నాప్‌చేసి తీసుకెళ్లాడు. ఇంటర్నెట్ కాల్ ద్వారా దీక్షిత్ తల్లికి ఫోన్ చేసి రూ. 45 లక్షలిస్తే కుమారుడిని విడిచి పెడతామని తెలిపాడు. వెంటనే బాలుడి తల్లిదండ్రులు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ప్లాట్ అమ్మి ఇవ్వండి...
పోలీసులు 200 సీసీ ఫుటేజీని పరిశీలించగా ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం మరోసారి అగంతకుడు ఫోన్ చేసి డబ్బుల గురించి అడిగాడు. కొంత డబ్బు తయారైందని సమాధానం ఇవ్వగా... ఇటీవల కొనుగోలు చేసిన ప్లాట్‌ను అమ్మి ఇవ్వొచ్చుగా అని ఫోన్ కట్ చేశాడు.
100కి పైగా అనుమానితులు...
హైదరాబాద్, వరంగల్ నుంచి వచ్చిన సైబర్, క్రైం, టాస్క్‌ఫోర్స్ బృందాలు కేసును ఛేదించేందుకు తీవ్రంగా శ్రమించాయి. సుమారు 100 మందికిపైగా అనుమానితులను ఎస్పీ విచారించారు. అయినా ఎక్కడా ఆచూకీ లభించకపోవడం వల్ల కిడ్నాపర్ అడిగిన సొమ్మును ఇవ్వడానికి తల్లిదండ్రులు సిద్ధమయ్యారు.
గుట్టపై విగతజీవిగా...
బుధవారం రూ. 35 లక్షల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలతో వారు చెప్పిన ప్రాంతానికి వెళ్లి... చాలాసేపు వేచిచూసి ఇంటికి తిరిగొచ్చారు. చివరకు మహబూబాబాద్‌కు ఐదు కిలో మీటర్ల దూరంలో కేసముద్రం మండలం అన్నారం శివారు దానవాయి చిన్నగుట్టపై బాబు శవమై కనిపించాడు. ఐదు రోజులు అహోరాత్రులు శ్రమించి దర్యాప్తు చేపట్టిన దీక్షిత్ కేసు విషాదాంతం కావడం పట్ల జిల్లా ఎస్పీ కోటిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పరిచయం ఉన్న వ్యక్తే...
రంజిత్ కుటుంబంతో పరిచయం ఉండి మెకానిక్‌గా పని చేస్తున్న సాగర్ అనే నిందితుడు డబ్బు కోసమే ఈ ఘాతకానికి పాల్పడ్డాడని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడిని అపహరించి తన బైక్‌పై సీసీ కెమెరాలకు చిక్కకుండా గుట్టపైకి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీక్షిత్ విగతజీవిగా మారాడనే వార్తతో కన్నవారు తల్లిడిల్లిపోయారు. ఇంటి దీపం ఆరిపోయిందని కన్నీరుమున్నీరుగా విలపించారు. సమీప కృష్ణా కాలనీవాసులు విషాదంలో మునిగిపోయారు.
కఠినంగా శిక్షించండి...
కేసముద్రం మండలం అన్నారం దానవాయి గుట్ట వద్దకు స్థానికులు భారీగా తరలివచ్చారు. బాలుడిని హత్యచేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలుడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్... నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అంతిమయాత్ర...
దీక్షిత్‌రెడ్డి మృతదేహానికి గుట్టపై పోస్టుమార్టం నిర్వహించారు. పూర్తయిన వెంటనే రంజిత్ స్వగ్రామం మహబూబాబాద్ మండలం శనిగపురం గ్రామానికి తరలించారు. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బంధుమిత్రులు, గ్రామస్థులు భారీ సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ అంతిమయాత్రలో పాల్గొనగా... డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గుడిపూడి నవీన్‌రావులు, రంజిత్ కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఇదీ చదవండి: మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య