తెలంగాణా ఉద్యమంలో గాయాలపాలైన వారు, ఆర్థికంగా నష్టపోయిన వారు అడ్రస్ లేకుండా పోయారని... ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని వారు బుగ్గ కార్లలో ఊరేగుతున్నారని ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ పేర్కొన్నారు.
అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు..
మహబూబాబాద్‌లోని ఎక్సలెంట్ జూనియర్ కాలేజీలో సామజిక తెలంగాణ సాధన సమితి నిర్వహించిన మానుకోట అలాయ్... బలాయ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో తెరాసా ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక్క కాలేజీతో మొదలైన పల్లా ఈ రోజు యూనివర్సిటీ స్థాయికి ఎదిగాడని తెలిపారు. ఒక్కనాడు కూడా మండలిలో నిరుద్యోగ సమస్య, ఆదీవాసుల సమస్యలు మాట్లాడని మూగ జీవి పల్లాకు ఓటు వేస్తే ఓటు వృథా అవుతుందని వివరించారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే...
ఓ పార్టీ ప్రొఫెసర్ కోదండరామ్‌కు గవర్నర్ పదవి ఇస్తామని అన్నారని, దాని కన్నా ఎమ్మెల్సీ పెద్దదా అంటూ.. ఎవరికి లబ్ధి కోసం కోదండరామ్ పోటీలో ఉన్నారని ప్రశ్నించారు. కలివిడిగా ఉద్యమాలు చేసి విడి విడిగా పోటీ చేస్తున్న కమ్యూనిస్ట్‌లు ఓ సారి ఆలోచించుకోవాలన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ పోటీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికేనని ఆరోపించారు.
అధికార పార్టీ డబ్బులు, ప్రలోభాలకు గురి చెయ్యకపోతే చెరుకు సుధాకర్ గెలుపు ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రులంతా ఒకసారి ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.